రజనీకాంత్ నిర్ణయం మంచిదే!

November 23, 2017


img

ప్రముఖ కోలీవుడ్ నటుడు రజనీకాంత్ బుధవారం చెన్నై విమానాశ్రయంలో విలేఖరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, “ఇప్పట్లో నేను రాజకీయాలలోకి రావాలనుకోవడం లేదు. అటువంటి అవసరం కూడా కనిపించడం లేదు. సమయం వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తాను. ఇప్పుడు కాదు,” అని స్పష్టంగా చెప్పేశారు.

రజనీకాంత్ రాజకీయ ప్రవేశం చేస్తానంటూ ఒక దశాబ్దంపైగా అభిమానులను ఊరిస్తూనే ఉన్నారు. జయలలిత మృతి తరువాత తమిళనాడులో ఏర్పడిన రాజకీయ సంక్షోభం, రాజకీయ శూన్యతను చూసి అయన ప్రత్యక్ష రాజకీయాలలోకి రావడానికి సిద్దపడ్డారు. కానీ అయన ఎటూ తేల్చుకోలేక ఇంకా ఊగిసలాడుతుంటే, అయన కంటే ముందుగా కమల్ హాసన్ తాను రాజకీయాలలోకి ప్రవేశించబోతున్నట్లు నిర్ద్వందంగా ప్రకటించేశారు. అంతేకాదు..రజనీని కూడా తన పార్టీలో చేరమని ఆహ్వానించారు. అయన స్పందించలేదు కానీ మళ్ళీ కమల్ హాసనే, “మా ఇద్దరి ఆలోచనలు, దారులు వేరు..ఆయనకు భాజపా బాగా సూట్ అవుతుందని” చెప్పేసి, పార్టీ ప్రారంభించకముందే రజనీకి తలుపులు మూసేశారు. 

ఇక తమిళనాడులో రజనీకాంత్ కు ఎంతమంది అభిమానులున్నారో కమల్ హాసన్ కు కూడా అంతే మంది ఉన్నారు. రజనీ అభిమానులు ‘మాస్’ అయితే, కమల్ అభిమానులలో ‘క్లాస్ అండ్ మాస్’ రెండు వర్గాలవారూ ఉన్నారు. కనుక ఇద్దరూ రాజకీయాలలోకి దిగితే కమల్ హాసన్ దే పైచెయ్యి కావచ్చు. అదీగాక రజనీ కన్నడిగుడైనందున ఆయన రాజకీయ ప్రవేశం చేయాలనుకొన్నప్పుడు ఆయనను వ్యతిరేకిస్తూ కొందరు చెన్నైలో ర్యాలీలు నిర్వహించారు. 

తమిళనాడు శాసనసభ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా రజనీకాంత్ ఇంటికి వెళ్ళి భాజపాకు మద్దతు ఇవ్వమని కోరినా రజనీకాంత్ అంగీకరించలేదు. కనుక కేంద్రం కూడా ఆయనపై గుర్రుగానే ఉంది. ఇవీకాక రజనీకాంత్ వయసు, ఆరోగ్యం రెండూ కూడా రాజకీయాలకు సరిపోయేవి కావు. కనుక రాజకీయాలలో ప్రవేశించకూడదనే రజనీకాంత్ నిర్ణయం సరైనదేనని చెప్పవచ్చు.  



Related Post