పాపం రేవంత్ రెడ్డి!

October 21, 2017


img

టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంతకాలం పార్టీలో..రాష్ట్ర రాజకీయాలలో పులిలా బ్రతికారు. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకొన్నప్పటి నుంచి ఆయన పరిస్థితి మారిపోయింది. ఆయన తమ పార్టీలో చేరడాన్ని వ్యతిరేకిస్తున్నవారిని, అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నవారిని స్వయంగా కలుస్తున్నారు. ఆయన శనివారం సాయంత్రం టిపిసిసి ఉపాధ్యక్షురాలు, కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ నివాసానికి వెళ్ళి ఆమెతో సమావేశమయ్యారు. ఆమె భర్త డికె భరతసింహారెడ్డి, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గ తెదేపా ఇన్-ఛార్జ్ కశ్యప్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

రేవంత్ రెడ్డి, డికె అరుణ ఇద్దరూ మహబూబ్ నగర్ జిల్లాకే చెందినవారు కావడంచేత ఆయన పార్టీలో చేరడానికి డికె అరుణ అభ్యంతరం చెపుతున్నట్లు వార్తలు వచ్చిన నేపధ్యంలో రేవంత్ రెడ్డి స్వయంగా ఆమె నివాసానికి వెళ్ళి మాట్లాడటంతో ఆమెను అంగీకరింపజేసినట్లు సమాచారం. దీనితో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని మరోసారి ప్రకటించుకొనట్లయింది లేకుంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆమెను కలవడానికి వేరే కారణం ఏమీ లేదు. 

ఆయన ఇప్పటికే కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నేతలను కలిసిన రేవంత్ రెడ్డి త్వరలో మరికొందరిని కలువబోతున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం స్వయంగా ఆహ్వానించి పార్టీలో చేర్చుకొని ఉండి ఉంటే అది ఆయనకు చాలా గౌరవంగా ఉండేది. కానీ ఇంతకాలం తెదేపాలో పులిలా బ్రతికిన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడానికి స్వయంగా కాంగ్రెస్ నేతల ఇళ్ళకు వెళ్ళి వారిని ఒప్పించవలసి రావడం చాలా దయనీయమైన విషయమే. ఇదంతా చూస్తుంటే ఆయన ఇంత దిగజారవలసిన అవసరం ఉందా? అనే సందేహం కలుగక మానదు. 


Related Post