ఆడపులి బోనులో నుంచి బయటకు వచ్చింది

October 06, 2017


img

అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరపన్న అగ్రహర జైలులో నాలుగేళ్ళు జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళకు ఈరోజు న్యాయస్థానం షరతులతో కూడిన పెరోల్ మంజూరు చెసింది. తన భర్త నటరాజన్ తీవ్ర అనారోగ్యంతో చావుబ్రతుకుల మద్య గ్లోబల్ ఆసుపత్రిలో ఉన్నారని, ఈ సమయంలో తాను ఆయన పక్కన ఉండటం చాలా అవసరం గనుక తనకు 15 రోజులు పెరోల్ మంజూరు చేయాలని శశికళ న్యాయస్థానానికి పిటిషను పెట్టుకొంది. అయితే మొన్న ఆయనకు చెన్నై గ్లోబల్ ఆసుపత్రిలో కాలేయం, కిడ్నీల మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయి ఆయన కోలుకొంటుండటంతో ఆమెకు 5 రోజులు పెరోల్ మంజూరుచేస్తే సరిపోతుందని కర్నాటక జైళ్ళశాఖ అధికారులు చెప్పడంతో, నాయస్థానం ఆమెకు 5 రోజుల కోసం షరతులతో కూడిన పెరోల్ మంజూరు చేసింది. 

పెరోల్ పై బయటకు వెళ్ళినప్పుడు రాజకీయ నాయకులను ఎవరినీ కలవకూడదని, మెరీనా బీచ్ వద్ద జయలలిత సమాధివద్దకు వెళ్లరాదని, ఎటువంటి రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనరాదని కోర్టు షరతులు విధించింది. ఆమె తరపు న్యాయవాది అందుకు అంగీకరించడంతో ఆమెకు పెరోల్ మంజూరు చేసింది. మరికాసేపటిలో ఆమె బెంగళూరు నుంచి చెన్నై బయలుదేరబోతున్నారు. ఆమెను తోడ్కొని పోవడానికి ఆమె మేనల్లుడు దినకరన్ బెంగళూరు చేరుకొన్నారు. వారి మద్దతుదారులు కూడా ఆమెకు స్వాగతం చెప్పడానికి పరపన్న అగ్రహర జైలు వద్దకు చేరుకొన్నారు. 

ఆమె బోను నుంచి బయటకు వచ్చిన ఆడపులి వంటిదేనని చెప్పవచ్చు. తనకు ఈ దుర్ఘతి పట్టించిన పన్నీరు సెల్వంపై, ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెడితే తననే పార్టీ నుంచి బషిష్కరించిన పళనిస్వామిపై ఆమె పగతో రగిలిపోవడం సహజమే. కనుక ఆమె ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారిరువురినీ రాజకీయంగా దెబ్బ తీసేందుకు ఆసుపత్రిలోనే వ్యూహరచన చేసే అవకాశం ఉంది. కనుక ఆమె మళ్ళీ తిరిగి జైలుకు వెళ్ళేవరకు పళని సర్కార్ కు గండం పొంచి ఉన్నట్లే భావించవచ్చు. 


Related Post