వ్యవస్థలో లోపాలకు విద్యార్ధులు బలవుతున్నారా?

October 06, 2017


img

అరకొర సౌకర్యాలున్న ప్రభుత్వ, పాఠశాలలో, కాలేజీలలో చదువుకొంటున్న పేద విద్యార్ధులు మంచి మార్కులతో నూటికి నూరు శాతం ఉత్తీర్ణులవుతుంటే, అన్ని ఆధునిక సౌకర్యాలు కల్పించి, లక్షల రూపాయలు ఫీజులు పిండుకొంటున్న కార్పోరేట్ కాలేజీలలో విద్యార్ధులు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. 

కడప పట్టణంలో నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న పావని అనే ఒక 16 ఏళ్ళ విద్యార్ధిని ఈరోజు తెల్లవారుజామున తన హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. ఈ సంగతి తెలుసుకొన్న ఆమె తల్లి తండ్రులు, కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆమె శవాన్ని పోస్ట్ మార్టం కోసం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియవలసి ఉంది. 

సాధారణంగా కార్పోరేట్ కాలేజీలలో చదువుకొంటున్న విద్యార్ధులు సీనియర్స్ ర్యాగింగ్ వల్లనో లేదా చదువుల ఒత్తిడి భరించలేకనో  ఆత్మహత్యలు చేసుకొంటున్నారని అనేకసార్లు బయటపడింది. కనుక పావని ఆత్మహత్యకు ఈ రెండింటిలో ఏదో ఒకటి కారణం అయ్యుండవచ్చు. 

తల్లి తండ్రులు అపురూపంగా పెంచుకొంటున్న తమ పిల్లల ఉజ్వల భవిష్యత్ కోసం తమకు శక్తికి మించి లక్షల రూపాయలు ఫీజులు చెల్లించి కార్పోరేట్ కాలేజీలలో జేర్పిస్తే, పాపం..పావని వంటి బాలికలు ఇంకా లోకం చూడకమునుపే ఇంత చిన్న వయసులోనే అర్ధాంతరంగా జీవితాలు ముగిస్తున్నారు. ఇటువంటి ఘటనలు చూస్తున్నప్పుడు, తల్లితండ్రులు లక్షలు చెల్లించి తమ పిల్లలను చేజేతులా చంపుకొంటున్నారనే భావన కలిగితే ఆశ్చర్యం లేదు. 

ఇటువంటి విషాదకర ఘటనలు చూసిన తరువాత కూడా తల్లి తండ్రులలో ఎటువంటి మార్పు కనిపించకపోవడం ఆ బాలబాలికల దురదృష్టమే. కార్పోరేట్ కాలేజీలలో చదివితే తప్ప పిల్లలు పెద్ద చదువులు చదవలేరని, జీవితంలో రాణించలేరనే ఒక బలమైన అపోహను, నమ్మకాన్ని సదరు కాలేజీ యాజమాన్యాలు తల్లి తండ్రులలో బలంగా నాటడం వలననే, ఇటువంటి ఎన్ని సంఘటనలు జరుగుతున్నా తల్లి తండ్రుల ఆలోచనా వైఖరిలో కూడా ఎటువంటి మార్పు కనిపించడం లేదు. ఈరోజుల్లో ఇటువంటి ఘటనలు కూడా రొటీన్ అయిపోయాయి కనుక వాటి నుంచి కార్పోరేట్ కాలేజీలు చాలా సులువుగానే బయటపడగలుగుతున్నాయి.  మన విద్యావ్యవస్థ ఇటువంటి దారుణమైన పరిస్థితిలో ఉండటం చాలా శోచనీయం. అయినా ప్రభుత్వాలు దానిని సరిచేయకపోవడం ఇంకా బాధకారం. ఇవే..అభంశుభం తెలియని ఆ పిల్లలపాలిట శాపంగా మారుతోంది...కార్పోరేట్ కాలేజీలకు వరంగా నిలుస్తోంది. ప్రభుత్వం మేలుకొని విద్యావ్యవస్థను సరిదిద్దేలోగా ఇంకా ఎంతమంది పిల్లలు బలవుతారో! పాపం పిల్లలు! 


Related Post