త్వరలో కమల్ రాజకీయ ప్రవేశం?

October 04, 2017


img

ప్రముఖ నటుడు కమల్ హాసన్ త్వరలో రాజకీయ ప్రవేశం చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 7వ తేదీన తన పుట్టిన రోజు సందర్భంగా కొత్త పార్టీని ప్రారంభించే అవకాశాలున్నట్లు సమాచారం. రాజకీయ ప్రకటన చేసిన తరువాత పార్టీని స్థాపించడంలో ఆలస్యం జరిగితే తన రాకతో నష్టపోయే పార్టీలు తనను దెబ్బ తీసే ప్రయత్నాలు చేయవచ్చు. పైగా నానాటికీ అభిమానుల ఒత్తిడి కూడా పెరిగిపోతోంది. కనుక ఇక ఆలస్యం చేయకుండా నవంబర్ 7న పార్టీని ప్రకటించేసి తరువాత తాపీగా పార్టీ నిర్మాణపనులు ప్రారంభించడం మంచిదని కమల్ హాసన్ భావిస్తున్నట్లు సన్నిహితులు చెపుతున్నారు.

జయలలిత మృతి చెందినప్పటి నుంచి నేటివరకు తమిళనాడులో తీవ్ర రాజకీయ అనిశ్చితి నెలకొని ఉంది. ఆ కారణంగా రాష్ట్రంలో పాలన దాదాపు స్తంభించిపోయింది...అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నత్త నడకన సాగుతున్నాయి. అన్నాడిఎంకెలో నిరంతరంగా కొనసాగుతున్న రాజకీయ డ్రామాలతో తమిళనాడు ప్రజలు కూడా విసుగెత్తిపోయున్నారు. రజనీకాంత్ రాజకీయాలలోకి వస్తారని నేటికీ అయన అభిమానులు, సన్నిహితులు  చెప్పుకొంటున్నారు తప్ప అయన అటువంటి ప్రయత్నమేదీ చేయడం లేదు. కనుక కమల్ హాసన్ రాజకీయ ప్రవేశం చేయడానికి అన్నివిధాల అనువైన వాతావరణం నెలకొని ఉందిప్పుడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అయన కూడా భావిస్తున్నారు. కనుక నవంబర్ 7న పార్టీని ప్రకటించే అవకాశం ఉందనే భావించవచ్చు.


Related Post