గద్దర్ ముఖ్యమంత్రి అభ్యర్ధిట!

September 22, 2017


img

ప్రజాగాయకుడు గద్దర్‌ అలియాస్‌ గుమ్మడి విఠల్ రావును ‘మన తెలంగాణా పార్టీ’ తమ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించింది. వచ్చే నెల 29న హైదరాబాద్ లో ఆ పార్టీ మేధోమధన కార్యక్రమం నిర్వహించబోతోంది. దాని కరపత్రాలను ఈరోజు సోమాజీగూడా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో విడుదల చేస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు కె. వీరారెడ్డి ఈవిషయం విలేఖరులకు తెలిపారు. అక్టోబర్ 29న మళ్ళీ అధికారికంగా దీనిపై ప్రకటన చేస్తామని తెలిపారు. అదేరోజున తమ పార్టీ మ్యానిఫెస్టోను కూడా విడుదల చేస్తామని తెలిపారు. 

ఒక ప్రజాగాయకుడిగా గద్దర్ అందరికీ పరిచయమే. అతని పాటలలో అర్ధం, ఆర్ద్రత, ఆవేదన చాలా మందికి నచ్చుతుంది. కానీ ఆయన భావజాలం పట్ల ఎవరూ ఆకర్షితులైనట్లు కనబడరు. ఎందుకంటే, కాంగ్రెస్, తెరాస, తెదేపా, చివరికి వామపక్షాలు రాజకీయాలను హ్యాండిల్ చేసే తీరుకు ఆయన తీరు పూర్తి భిన్నంగా ఉండటమే అందుకు కారణమని చెప్పవచ్చు. 

ఇక మావోయిజం వలన వ్యవస్థలో ఎటువంటి మార్పురాదని గ్రహించడానికే ఆయనకు నాలుగు దశాబ్దాలు పట్టింది. అటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని అర్ధం చేసుకోవడానికి ఇంకెన్నేళ్ళు పడుతుంది? తన భావజాలానికి పూర్తి విరుద్దంగా నదుస్తున్న ఈ కుళ్ళు రాజకీయాలలో ఆయన ఇమడగలరా? దాని పద్దతులకు ఎప్పటికైనా అలవాటుపడగలరా లేక భవిష్యత్ లో ఈ కుహనా ప్రజాస్వామ్యం వలన బలహీనవర్గాలకు రాజ్యాధికారం రాదు. పోరాటాలే శరణ్యం అంటూ మావోయిజం వైపు మళ్ళుతారా? అసలు గద్దర్ వంటి వ్యక్తిని తెలంగాణా ప్రజలు ముఖ్యమంత్రిగా అంగీకరిస్తారా? అని ఆలోచిస్తే బాగుండేది.

అధికారం, పదవులు, డబ్బు రాజకీయాలను శాశిస్తున్న ఈరోజుల్లో ఆయన పాటలు పాడి ఓట్లు రాబట్టుకోవడం సాధ్యమేనా? వర్తమాన రాజకీయ పరిస్థితులను వాస్తవిక దృక్పధంతో చూడకుండా, అందుకు అనుగుణంగా తనను తాను మలుచుకోకుండా నేటికీ ఆశయాలు, సిద్దాంతాలని మాట్లాడుతూ, పాటలు పాడుతూ కూర్చొంటే రాజకీయాలలో రాణించగలరా? వాస్తవిక దృక్పధం లేని ఇటువంటి సైన్యాధ్యక్షుడిని పెట్టుకొని ఎన్నికల కురుక్షేత్రంలో దిగి విజయం సాధించగలరా? అని ఆలోచిస్తే బాగుంటుందేమో కదా!


Related Post