పాపం..రోహింగ్యాలు!

September 15, 2017


img

మయన్మార్ ప్రభుత్వం తమ దేశంలోని రోహింగ్యాల జాతి ప్రజలను మయన్మార్ ప్రజలుగా గుర్తించడానికి నిరాకరించి వారిపై తీవ్ర ఒత్తిడి చేస్తుండటంతో లక్షలాది మంది రోహింగ్యా శరణార్ధులు కట్టుబట్టలతో పొరుగునే ఉన్న భారత్, బంగ్లాదేశ్ లోకి ప్రవేశిస్తున్నారు. బంగ్లాదేశ్ లో ఇప్పటికే మూడు లక్షల మంది శరణార్ధులు చేరుకోగా గత నెలరోజులలో సుమారు రెండు లక్షల మంది వచ్చి చేరారు. బంగ్లాదేశ్ లో అవకాశం దొరకని వారు భారత్ లోకి ప్రవేశిస్తున్నారు. 

వేలాదిగా తరలివస్తున్న రోహింగ్యాల వలన సామాజిక ఆర్ధిక సమస్యలతో బాటు దేశభద్రతకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందనే కారణంతోనే వారిని వెనక్కు త్రిప్పి పంపడానికి భారత్ ప్రయత్నిస్తోంది. అయితే సున్నితమైన ఈ సమస్యపై కూడా అప్పుడే దేశంలో ఓటు బ్యాంక్ రాజకీయాలు మొదలవడం బాధాకరం. 

రోహింగ్యాలను త్రిప్పి పంపడంపై సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. దానిపై కేంద్రప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ లో వారి వలన దేశానికి ఎదురయ్యే సమస్యల గురించి వివరించింది. రోహింగ్యాల ముసుగులో ఉగ్రవాదులు, అసాంఘీక శక్తులు దేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. ముఖ్యంగా ఐసిస్ ఉగ్రవాదులు రోహింగ్యాలను మచ్చిక చేసుకొని వారిని భారత్ లో పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తమకు సమాచారం ఉందని తెలిపింది. 

కేంద్రప్రభుత్వం స్పందనపై మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. కట్టుబట్టలతో, ప్రాణభయంతో భారత్ వస్తున్న రోహింగ్యాలను ఆదరించకుండా బలవంతంగా వెనక్కు త్రిప్పి పంపడం సరికాదని అన్నారు. 

నిజమే.. దిక్కుతోచని స్థితిలో నిరాశ్రయులైన రోహింగ్యాలు కట్టుబట్టలతో తమ పసిపిల్లలను, వృద్ధులను, మహిళలను వెంటపెట్టుకొని ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు మానవతా దృక్పధంతో వారిని ఆదరించవలసిందే. అందుకే బంగ్లాదేశ్ లో చేరుకొన్న శరణార్ధుల కోసం బారీగా ఆహారం, మందులు, బట్టలు, దుప్పట్లు వంటివి పంపిస్తూనే ఉంది. 

కానీ లక్షలాదిగా తరలివస్తున్న వారికి శాస్వితంగా ఆశ్రయం కల్పించడం ఏ దేశానికైనా చాలా కష్టమే. అందుకే వారిని వారి స్వదేశానికి త్రిప్పి పంపేందుకు భారత్ కృషి చేస్తోంది. అందుకోసం బంగ్లాదేశ్, మయన్మార్ ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతోంది. కానీ అసదుద్దీన్ వంటి స్వార్ధ రాజకీయ నేతలు రోహింగ్యాల తరపున గట్టిగా మాట్లాడితే దేశంలో ముస్లింలందరినీ ఆకట్టుకోవచ్చని, తద్వారా ఎన్నికలప్పుడు వారి ఓట్లు రాల్చుకోవచ్చని కలలుకంటున్నారు.        అటువంటి వారికి దేశప్రయోజనాల కంటే తమ ఓటు బ్యాంక్ రాజకీయాలే ముఖ్యం అని అర్ధం అవుతోంది.



Related Post