కేసీఆర్ ను ఓడిస్తా.. కాంగ్రెస్ అధ్యక్షుడినవుతా!

July 26, 2017


img

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలు వింటుంటే అవి ఉత్తరకుమార ప్రగల్భాలని ఎవరికైనా అనిపిస్తే తప్పులేదు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఏకాకిగా రోజులు నెట్టుకొస్తున్న వెంకటరెడ్డి నిన్న అటువంటివే చాలా విషయాలు చెప్పారు. 

శాసనసభ వద్ద ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “నేను జరిపించిన తాజా సర్వే ప్రకారం రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి 65 నుంచి 70 సీట్లు, తెరాసకు కేవలం  30 సీట్లు మాత్రమే వస్తాయని తేలింది. నకిరేకల్, సూర్యాపేటలో తెరాస అభ్యర్ధులకు డిపాజిట్లు కూడా దక్కవని తేలింది. ఇక ఎన్టీఆర్ అంతటి గొప్ప ప్రజాకర్షణ ఉన్న వ్యక్తే ఎన్నికలలో ఓడిపోయారు. నిత్యం అబద్దాలతో, మాయమాటలతో కాలం వెళ్ళబుచ్చుతున్న కేసీఆర్ ఏపాటి? వచ్చే ఎన్నికలలో నేనే ఆయనపై పోటీ చేసి ఓడించడం ఖాయం,” అని అన్నారు. 

“నాకు ముఖ్యమంత్రి లేదా మంత్రి అవ్వాలనే కోరిక లేదు కానీ పిసిసి అధ్యక్షుడు కావాలని ఉంది. ఇదే విషయం మా పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కూడా చెప్పాను. నాకు ఒకసారి రాష్ట్రంలో పార్టీకి సారధ్యం వహించే అవకాశం ఇవ్వాలని కోరాను. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి తీసుకురావడమే నా ఏకైక లక్ష్యం అని రాహుల్ గాంధీకి చెప్పాను. ఈ ఏడాది అక్టోబర్ నెలలో పిసిసి అధ్యక్షుడి మార్పు జరుగవచ్చు. అందుకోసమే పార్టీలో సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ నాకు ఒక అవకాశం ఇస్తారని నేను బలంగా నమ్ముతున్నాను,” అని వెంకటరెడ్డి అన్నారు. 

“మియాపూర్ భూకుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు గోల్డ్ స్టోన్ ప్రసాద్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నప్పటికీ తెరాస సర్కార్ అతనిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని వెంకటరెడ్డి ప్రశ్నించారు. ఇటీవల కాలంలో బయటపడిన ఈ మియాపూర్ భూకుంభకోణం దేశంలోనే అతిపెద్దదని దానిని తెరాస సర్కార్ దాచిపుచ్చాలని విశ్వప్రయత్నాలు చేస్తోందని వెంకటరెడ్డి ఆరోపించారు. ఆ కుంభకోణంలో హస్తం ఉందని ఆరోపించబడుతున్న తెరాస నేతలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు వెనకేసుకు వస్తున్నారో చెప్పాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈకేసులో బాధ్యులందరిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతూ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డికి ఒక వినతి పత్రం కూడా ఇచ్చారు.

“కేసీఆర్ ను ఓడిస్తా... రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడుని అవుతానని” కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏ ధీమాతో చెప్పుకొంటున్నారో తెలియదు కానీ వాటితో ఆయన రాష్ట్ర రాజకీయాలలో ఒక రాజకీయ బఫూన్ గా తనను తాను ప్రదర్శించుకొంటున్నట్లుంది. ఆయన చెపుతున్న మాటలను ఏ ఒక్క కాంగ్రెస్ నేత సమర్ధిస్తూ మాట్లాడిన దాఖాలాలు లేవు. స్వంత పార్టీ నేతలతోనే ఇమడలేకపోతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీకి అధ్యక్షుడు అవుదామని ఎందుకు కలలుగంటున్నారో.. అధ్యక్షుడు అయితే వారందరినీ ఏవిధంగా కలుపుకొనిపోయి పార్టీని గెలిపించాలనుకొంటున్నారో ఆయనకే తెలియాలి. ఇక కేసీఆర్ ని ఓడించడం ఓ పెద్ద జోక్ అనే చెప్పాలి. అంతకంటే వచ్చే ఎన్నికలలో తెరాసను ఓడిస్తామని చెప్పుకొంటే హుందాగా ఉంటుంది కదా!  


Related Post