ఒక్క ముద్రగడ..3వేలు పోలీసులు!

July 26, 2017


img

తూర్పు గోదావరి జిల్లాలో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ కాపు నేత ముద్రగడ పద్మనాభం జిల్లాలోని కిర్లంపూడిలో గల తన నివాసం నుంచి అమరావతి వరకు ఈరోజు పాదయాత్ర మొదలుపెట్టాలని నిశ్చయించుకొన్నారు. కానీ దానికి పోలీస్ శాఖ అనుమతీయలేదు. తన పాదయాత్ర చేయడానికి పోలీసుల అనుమతి తీసుకోబోనని ఆయన ముందే ప్రకటించారు. 

కనుక ఆయన పాదయాత్రను అడ్డుకోవడానికి ఏపి సర్కార్ సుమారు 3,000 మందికి పైగా పోలీసులను జిల్లా అంతటా మోహరించింది. ఆ ఒక్క జిల్లాలోనే ఏకంగా 95 తాత్కాలిక పోలీస్ అవుట్ పోస్టులను ఏర్పాటు చేసి కిర్లంపూడిని పూర్తిగా దిగ్బందనం చేశారు. నిన్న సాయంత్రం కిర్లమ్పూడిలో స్పెషల్ పోలీసులు కవాతు కూడా నిర్వహించారు. కిర్లంపూడి పరిసర ప్రాంతాలలో కర్ఫ్యూ విధించారు. జిల్లా అంతటా కూడా సభలు, ఊరేగింపులను నిషేధించారు. ముందస్తు జాగ్రత్తగా కొందరు కాపు నేతలను అరెస్ట్ చేశారు. తుని విద్వంసాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకొంటున్నట్లు రాష్ట్ర పోలీస్ డిజిపి డీజీపీ నండూరి సాంబశివరావు మీడియాకు తెలిపారు. కనుక ఈ పాదయాత్రకు అందరూ దూరంగా ఉండాలని కాపు సామాజిక వర్గాన్ని కోరారు.   

ముద్రగడ గతంలో కూడా ఇటువంటి ప్రయత్నమే చేసినప్పుడు ఆయనను పోలీసులు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించి అక్కడే సుమారు రెండు వారాలు నిర్బంధించి ఉంచారు. బహుశః మళ్ళీ ఈరోజు కూడా అదేవిధంగా జరిగే అవకాశం కనబడుతోంది. 

ముద్రగడకు నిజంగానే కాపులకు రిజర్వేషన్లు సాధించుకోవాలనే తపన ఉండి ఉంటే ఆయన ప్రభుత్వంపై యుద్ధం చేసే బదులు సఖ్యతగా ఉంటూ సాధించుకోవచ్చు. కానీ ఆయన రిజర్వేషన్లు సాధించడం కోసం కాక చంద్రబాబు ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసి, తెదేపాకు కాపులను దూరం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లున్నారు. తద్వారా వచ్చే ఎన్నికలలో జగన్ కు లబ్ది చేకూర్చడానికే అయన ఇదంతా చేస్తున్నారని, ఆయన జగన్ చేతిలో పావుగా మారారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. వారి ఆరోపణలకు బలం చేకూరుస్తున్నట్లే ఉంది ముద్రగడ వ్యవహార శైలి. 

ఆయనను అడ్డుకోవడంలో ఏపి సర్కార్ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్లు అర్ధం అవుతూనే ఉంది. కనుక ముద్రగడ పాదయాత్ర చేయనప్పటికీ, ఆ ఫలితం ఆయన ఇంట్లో కూర్చొనే సాధించగలుగుతున్నారని చెప్పవచ్చు. ప్రభుత్వం ఆయనపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తోందని పోలీస్ బందోబస్తు చూసినవారు భావించకుండా ఉండరు. 

అలాగే ఆయన కూడా తుని విద్వంసం కారణంగా ప్రభుత్వానికి అడ్డంగా దొరికిపోయారు. అది ఆయన వీక్ పాయింట్ గా మారిపోయింది. ఆయన ఎప్పుడు హడావుడి చేసినా తెదేపా నేతలు, పోలీసులు ముందు  ఆ విషయమే ప్రస్తావిస్తుంటారు. ఇది కాపులకు రిజర్వేషన్ సాధించడం కోసం జరుగుతున్న పోరాటంలాగ కాకుండా చంద్రబాబు-జగన్ మద్య జరుగుతున్న పోరాటంలాగ కనిపిస్తుండటం విశేషం. దానిలో ముద్రగడ ఒక పావుగా మారినట్లు కనిపిస్తోంది.  


Related Post