జానా అండ్ ఉత్తం రెడ్డి ఆర్ ఫ్రెండ్స్ నౌ!

June 09, 2017


img

ఎన్నికలు రానంతవరకు తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్ నేతల మద్య సయోధ్య బాగానే కనిపిస్తుంటుంది కానీ ఎన్నికలు రాగానే ఎవరికివారు యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తుంటారు. 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో అత్యంత అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ అనైక్యత కారణంగానే వాటిని ఉపయోగించుకొని కాంగ్రెస్ నేతలు అధికారంలో రాలేకపోయారని అందరికీ తెలుసు. నేటికీ ఉత్తం కుమార్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నవారు కాంగ్రెస్ పార్టీలో చాలా మందే ఉన్నారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఆయన నేతృత్వంలోనే వచ్చే ఎన్నికలను ఎదుర్కోవాలని గట్టిగా చెప్పడంతో ఆయన వ్యతిరేకులు అందరూ చల్లబడిపోయారు. 

ఇటీవల సంగారెడ్డి జరిగిన బహిరంగ సభలో వేదిక మీద ఉన్న కాంగ్రెస్ నేతలను అందరినీ ఉద్దేశ్యించి, “మీరందరూ ఐక్యంగా ఉన్నారనే నమ్మకం ప్రజలకు కల్పించినప్పుడే వారు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు మీరందరూ చాలా ఐకమత్యంగా పనిచేయాలి,” అని రాహుల్ గాంధీ చెప్పడం వారందరికీ గట్టి హెచ్చరికవంటిదేనని చెప్పవచ్చు.

బహుశః అందుకేనేమో చిరకాలంగా ముఖ్యమంత్రి పదవిపై ఆశపెట్టుకొన్న సీనియర్ కాంగ్రెస్ నేత  కె జానారెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ, “ఉత్తం కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కాదలిస్తే నేను ఆయనకు మద్దతు పలుకుతాను,” అని అన్నారు. తద్వారా కాంగ్రెస్ అధిష్టానానికి విధేయత ప్రకటించినట్లు అయ్యింది. ఉత్తం కుమార్ రెడ్డితో దోస్తీ బలపడుతుంది. అదీగాక టీ-కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నవారు కనీసం ఒక డజను మందికి పైనే ఉన్నారు. కనుక ఇప్పటి నుంచి దాని కోసం తెర వెనుక ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం ఉండదని గ్రహించినందునే జానారెడ్డి ఈవిధంగా అని ఉండవచ్చు. 

అయితే కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ప్రదర్శిస్తున్న ఈ ఐక్యతను వచ్చే ఎన్నికలలో కూడా చూపగలిగితే తప్పకుండా వారి విజయావకాశాలు మెరుగుపడతాయి. కేసీఆర్ ప్రకటించిన తాజా సర్వేలో వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రెండే రెండు సీట్లు గెలుచుకొంటుందని చెప్పారు కనుక ఇప్పటి నుంచి ముఖ్యమంత్రి పదవి కోసం పగటికలలు కనడం కంటే రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెడితే మంచిది. ఒకవేళ వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నిజంగానే గెలిస్తే అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి కావాలో ఆలోచించుకోవచ్చు.


Related Post