ఫోటోలు దిగేందుకే రాహుల్ అక్కడికి వెళ్ళారుట

June 09, 2017


img

భాజపా పాలిత మధ్యప్రదేశ్ లో తీవ్ర ఉద్రిక్తపరిస్థితులు నెలకొని ఉన్న మందసౌర్ ప్రాంతానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం బయలుదేరడం, మధ్యలో పోలీసులు అడ్డుకోవడంతో కొంత దూరం ఆయన మోటార్ బైక్ పై పయనించడం, పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడం, అందుకు కాంగ్రెస్ నేతలు, రాహుల్ విమర్శలు గుప్పించడం మొదలైన సంఘటనలపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పందిస్తూ, “ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే  రైతులను రెచ్చగొట్టి ఆందోళనలు చేయిస్తోంది. రాహుల్ గాంధీ ఫోటోలు దిగడం కోసమే అక్కడికి బయలుదేరారు. ఇదివరకు దిగ్విజయ్ సింగ్ మద్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆందోళన చేస్తున్న రైతులపై కాల్పులకు అనుమతించిన సంగతి కాంగ్రెస్ నేతలు మరిచిపోయారా? 1998 జనవరి 12వ తేదీన బీటల్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కాల్పులు జరిపించినప్పుడు 24 మంది రైతులు మరణించారు. అప్పుడు ముఖ్యమంత్రి రాజీనామా చేశారా? మరి ఇప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు?

భాజపా పాలిత రాష్ట్రంలో రాజకీయ అస్థిరత సృష్టించాలనే దురుదేశ్యంతోనే కాంగ్రెస్ పార్టీ ఈవిధంగా వ్యవహరించడం చాలా దారుణం. రైతుల సమస్యలను పరిష్కరించడానికి శివరాజ్ సింగ్ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. వీలైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సహకరించాలి తప్ప స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల సమస్యలను రాజకీయం చేయాలనుకొంటే ప్రజలు క్షమించరు,” అని అన్నారు. 

రైతులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినప్పుడు వారిని పట్టించుకోకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటాయి. అప్పుడే వారు రోడ్లేక్కి ఆందోళనకు సిద్దం అవుతారు. ఖమ్మం, వరంగల్ మిర్చి రైతుల ధర్నాలు, డిల్లీలో తమిళరైతుల ధర్నాలే అందుకు తాజా ఉదాహరణలు. అప్పటికీ ప్రభుత్వాలు స్పందించకపోతే అప్పుడు ప్రతిపక్షాలకు కూడా దానిలో ప్రవేశించే అవకాశం కలుగుతుంది. అప్పుడు పరిస్థితులు విషమించితే మద్యలో నష్టపోయేది రైతులే. 

అప్పుడు కూడా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయకుండా  అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై మరొకటి విమర్శలు చేసుకొంటూ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయకుండా ఈవిధంగా రాజకీయాలు చేస్తుంటాయి. పైగా మీరు అప్పుడు తప్పు చేయగా లేనిదీ మేము చేస్తే తప్పా అని నిసిగ్గుగా వాదించుకొంటాయి. అయినా జాతీయ నాయకుడిగా గుర్తింపు కలిగిన రాహుల్ గాంధీకి ఫోటోలు దిగేందుకే మంద్ సౌర్ బయలుదేరారని వెంకయ్య చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది.

ఒకప్పుడు వరంగల్ లో జరిగిన ఘటనలే అన్నీ మళ్ళీ అక్కడా పునరావృతం అవుతున్నాయి. అక్కడా మళ్ళీ అదే రాజకీయ డ్రామా సాగుతోందిప్పుడు. ఇంత జరిగినా రైతులు దేనికోసమైతే రోడ్లెక్కారో ఆ సమస్య పరిష్కారం కానే కాదు. డిల్లీలో తమిళ రైతులు, తెలంగాణాలో మిర్చి రైతుల సమస్యలే అందుకు మళ్ళీ ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఇదీ మన రాజకీయ పార్టీల పనితీరు. 


Related Post