కేసీఆర్ మనసులో మాట

June 08, 2017


img

దేశంలో రైతులు ఎప్పుడూ దోపిడీకి గురవుతూనే ఉంటారు. ఒకవేళ ఎప్పుడైనా వారు లాభపడితే అటువంటి సందర్భాలను వేళ్ళ మీద లెక్కించవచ్చు. తెలంగాణా రైతన్నలు అందుకు మినహాయింపు కాదు. ఇటీవల మర్చి రైతులు ఎన్ని కష్టాలు పడ్డారో అందరూ చూశారు. అందుకే వారి సమస్యలన్నిటికీ శాశ్విత పరిష్కారాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక ప్రాజెక్టులు, పధకాలు చేపడుతున్నారు. వాటిలో కొన్నిటికి అప్పుడే ఫలితాలు కనిపిస్తుండగా మరికొన్ని దీర్ఘకాలంలో ఫలితాలు వస్తాయి. అటువంటి మరో ఆలోచనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు బయటపెట్టారు. 

ఇంతవరకు రైతులు పండించిన పంటలను దళారుల ద్వారా మిల్లర్లు కొనుగోలు చేసి వాటిని మిల్లింగ్ చేసి ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నారు. ఇక ముందు రైతులకు గిట్టుబాటు ధర రానట్లయితే, తమ పంటలను తామే మిల్లింగ్ చేసుకొని అమ్ముకొనేందుకు లైసెన్స్ లు మంజూరు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఉదాహరణకు మిర్చికి ఆశించిన గిట్టుబాటు ధర రానప్పుడు మిర్చిని మిల్లింగ్ చేసి కారంగా మార్చుకోవడం ద్వారా మరింత ఎక్కువ లాభం పొందవచ్చు. 

దీని కోసం ముందుగా మండల స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు రైతులతో రైతు సమాఖ్యలు ఏర్పాటు చేసి వాటికి ప్రభుత్వమే రూ.500 కోట్లు మూలనిధులు సమకూర్చి అవసరమైతే మరికొంత బ్యాంకుల నుండి రుణాల రూపేణా ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు చెప్పారు. తద్వారా రైతు సమాఖ్యలు ఆర్ధికంగా బలపడతాయి కనుక ఆర్దిక సమస్యలు ఎదురైనప్పుడు రైతులు వాటిని తట్టుకొని నిలబడగలిగే శక్తి సంతరించుకొంటారని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. 

ఈ సమాఖ్యల ఏర్పాటు కోసం ఇప్పటికే వ్యవసాయ విస్తరణాదికారులు గ్రామస్థాయిలో పర్యటిస్తూ రైతుల పూర్తి వివరాలు సేకరిస్తూ రైతు-డాటా బ్యాంక్ తయారుచేస్తున్నారు. కనుక రానున్న 3-4 ఏళ్ళలో తెలంగాణా రైతన్నల పరిస్థితిలో గణనీయమైన మార్పులు కనబడే అవకాశాలు కనబడుతున్నాయి. 


Related Post