కాంగ్రెస్ లోకి కొండా దంపతులు?

June 07, 2017


img

కొండా సురేఖ దంపతులు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఒక వెలుగు వెలిగారు. కానీ వారు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైకాపాలో చేరి, ఆ తరువాత వైకాపాను వీడి తెరాసలో చేరినప్పటికీ వారి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు మారడంతో వారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్లు తాజా సమాచారం. 

రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణాలో ఉదృతంగా ఉద్యమాలు జరుగుతున్న సమయంలో కూడా కొండా దంపతులు స్వర్గీయ వైఎస్స్ఆర్ పట్ల ప్రేమాభిమానాల కారణంగా జగన్మోహన్ రెడ్డితోనే ముందుకు సాగి తెలంగాణా ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. అయినా వారు కడ వరకు జగన్ తోనే ఉన్నారు. కానీ రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలవగానే జగన్ తనను నమ్ముకొన్న వారిని నట్టేట ముంచేసి తనదారి తను చూసుకొన్నారు. దానితో కొండా దంపతుల రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ఆ సమయంలోనే వారు మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్ళిపోవాలనుకొన్నారు కానీ 2014 ఎన్నికలలో విజయావకాశాలున్న తెరాస నుంచి ఆహ్వానం అందడంతో తెరాసలో చేరారు. 

వారికి వరంగల్ జిల్లా రాజకీయాలపై మంచి పట్టున్నప్పటికీ తెరాసలో ప్రాధాన్యం దక్కలేదు. మాజీ మంత్రిగా పనిచేసి అందరిమెప్పు పొందిన కొండా సురేఖ కేసీఆర్ మంత్రివర్గంలో కూడా తనకు అవకాశం కావాలని కోరుకొంటున్నారు. కానీ మూడేళ్ళు గడిచినా ఆమెను ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెను పట్టించుకోకపోగా ఆమె నియోజకవర్గానికే చెందిన తెదేపా నుంచి వచ్చిన గుండు సుధారాణికి మహిళా ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ పదవితో బాటు తెరాస రాష్ట్ర మహిళా అధ్యక్షురాలి పదవి కూడా కట్టబెట్టడంతో తెరాసలో తమకు ఏమాత్రం ప్రాధాన్యం లేదని కొండా దంపతులు గ్రహించారు. కనుక వారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం.

ఫిరాయింపుల కారణంగా బలహీనపడిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బలోపేతం చేసుకొనే ప్రయత్నాలు మొదలుపెట్టింది కనుక వరంగల్ అర్బన్ జిల్లాలో ఇంత బలమైన నేతలు వచ్చి చేరుతామంటే వారిని సాదరంగా ఆహ్వానించవచ్చు. తెరాసలో అనాధారణకు గురవుతున్న బస్వరాజు సారయ్య కూడా కొండా దంపతులతో బాటు కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొండా దంపతులు వెళ్ళిపోవడం వలన తెరాసకు పెద్దగా నష్టం జరుగకపోవచ్చు కానీ కాంగ్రెస్ పార్టీకి చాలా మేలు కలుగవచ్చు. 



Related Post