తూచ్..ఆ నిధులు 5 ఏళ్ళలో ఇస్తామన్నాం!

May 26, 2017


img

భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా నల్లగొండ పర్యటనలో తెలంగాణా రాష్ట్రానికి లక్ష కోట్లు ఇచ్చామని గొప్పగా చెప్పుకోవడం..దానిపై రాష్ట్రంలో తెరాస-భాజపాల మద్య జరుగుతున్న యుద్దాన్ని అందరూ చూస్తూనే ఉన్నారు. రాష్ట్ర భాజపా నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ ని లక్ష్యంగా చేసుకొని  యుద్ధం సాగిస్తున్న ఈ సమయంలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వారి గాలి తీసేసే ఒక మాట చెప్పారు. 

ఆయన విజయవాడలో నిన్న జరిగిన బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణాకు నిధుల విడుదల గురించి అమిత్ షా చెప్పిన మాటలను తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అపార్ధం చేసుకొన్నారు. ఐదేళ్ళలో తెలంగాణా రాష్ట్రానికి ఆ నిధులను అందిస్తామని అమిత్ షా చెపితే వాటిని ఇప్పటికే ఇచ్చేశామని ఆయన చెప్పినట్లుగా భావిస్తున్నట్లున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలను సమానంగా అభివృద్ధి సాధించాలన్నదే మా ప్రభుత్వం కోరిక. ఏ రాష్ట్రంతో గొడవలు పెట్టుకొనే ఉద్దేశ్యం మాకు లేదు,” అని అన్నారు. 

కానీ అమిత్ షా తన పర్యటనలో ఈ మూడేళ్ళలోనే తెలంగాణాకు లక్ష కోట్లు పైగా ఇచ్చామని, దానికి తన వద్ద లెక్కలు కూడా ఉన్నాయని చెప్పిన సంగతి మీడియాలో ప్రముఖంగానే వచ్చింది. అందుకే అమిత్ షా అబద్దాలు చెపుతూ ప్రజలను మోసగిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ అంతగా ఫైర్ అయ్యారు.

నిజానికి రెండు తెలుగు రాష్ట్రాలలో చేపడుతున్న అనేక అభివృద్ధి, సంక్షేమ పనుల కోసం కేంద్రప్రభుత్వం ఈ ఐదేళ్ళలో బహుశః అంతకంటే చాలా ఎక్కువే ఇస్తుండవచ్చు. కానీ అంతా ఇచ్చేశామని అమిత్ షా చెప్పడమే తప్పు. దేశవ్యాప్తంగా జరుగుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ పనుల కోసం కేంద్రప్రభుత్వం ప్రతీ ఏడాది బడ్జెట్ కొంత మొత్తం కేటాయించి, పనుల పురోగతిని బట్టి వాయిదాల పద్దతిలో ఆ నిధులను కొద్దికొద్దిగా విడుదల చేస్తుందే తప్ప ఒకేసారి వేలు..లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలలో జమా చేసేయదు. అది సాధ్యం కాదు కూడా. ఈ సంగతి ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలుసు అమిత్ షాకు కూడా తెలుసు. అయితే ఎవరి పార్టీ ప్రయోజనాలను వారు చూసుకోవాలి గనుక ఆవిధంగా మాట్లాడినట్లు భావించవలసి ఉంటుంది.


Related Post