భాజపా అధికారంలోకి రాబోయే రాష్ట్రాలలో తెలంగాణా మొదటిదిట!

May 19, 2017


img

ఉత్తరాది మరియు ఈశాన్య రాష్ట్రాలలో భాజపా క్రమంగా విస్తరిస్తున్న మాట నిజమే. కానీ తెలంగాణా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇంతవరకు జరిగిన అన్ని ఎన్నికలలో భాజపా వరుసగా ఓటమి పాలవుతుండటం విశేషం. వరంగల్ లోక్ సభ ఉపఎన్నికలలో పట్టుబట్టి తెదేపా నుంచి సీటు తీసుకొన్నప్పటికీ పార్టీలో పోటీ చేసేందుకు బలమైన అభ్యర్ధి ఎవరూ లేకపోవడంతో హడావుడిగా ఎన్.ఆర్.ఐ. పి.దేవయ్యను పార్టీలో చేర్చుకొని పోటీ చేయించి తెరాస చేతిలో ఓటమి పాలయింది. తెదేపాతో దోస్తీయే తమ వరుస ఓటములకు కారణమని నిందిస్తూ దానికి దూరం జరిగింది. అయినా రాష్ట్ర భాజపా పరిస్థితిలో ఏమాత్రం మెరుగుపడలేదు పైగా భాజపాకు గట్టి పట్టున్న గ్రేటర్ హైదరాబాద్ లో కూడా అసలు పట్టేలేదనుకొన్న తెరాస చేతిలో దారుణంగా ఓడిపోయింది. ఇదీ రాష్ట్ర భాజపా పరిస్థితి. 

ఉత్తరాది రాష్ట్రాలలో వరుస విజయాలే రాష్ట్ర భాజపా నేతలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయో లేక పెరిగినట్లు నటిస్తున్నారో తెలియదు కానీ రాష్ట్రంలో తెరాసకు తమ పార్టీయే ప్రత్యామ్నాయమని, వచ్చే ఎన్నికలలో మేమే గెలిచి అధికారంలోకి రాబోతున్నామని బల్లగుద్ది గట్టిగా వాదిస్తున్నారు.

అయితే ఉత్తరాది ఫలితాల ప్రభావం తెలంగాణా రాష్ట్రంపై ఏమాత్రం ఉండబోదని, రాష్ట్రంలో పూర్తి భిన్నమైన రాజకీయ పరిస్థితులు నెలకొని ఉన్నాయని, తెలంగాణా ప్రజలు స్థానికతకు పెద్ద పీట వేస్తారనే సంగతి రాష్ట్ర భాజపా నేతలకు తెలియదనుకోలేము. కానీ ఇప్పుడు చాలా ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తున్నారు. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ మాటలు వింటే ఆ విషయం అర్ధం అవుతుంది.

ఆయన ఈరోజు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, “దక్షిణాదిన భాజపా అధికారంలోకి రాగల రాష్ట్రాల జాబితాలో తెలంగాణా రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో పెట్టాము. అందుకే మా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణాకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ 3 రోజుల రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోని నిజాయితీపరులైన నేతలను మాత్రమే మా పార్టీలో చేర్చుకొంటాము. అలాగని కాంగ్రెస్ నేతల కాళ్ళు పట్టుకోవలసిన అవసరం, ఖర్మ మాకు లేవు. ఎన్నికలకు 6 నెలల ముందుగానే శాసనసభ అభ్యర్ధుల పేర్లను ప్రకటిస్తాము. తెలంగాణాలో ఇంటింటికీ తిరిగి తెరాస సర్కార్ వైఫల్యాలను, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను మాటలతో ఏవిధంగా మభ్యపెడుతూ కాలక్షేపం చేస్తున్నారో వివరిస్తాము,” అని లక్ష్మణ్ చెప్పారు. 


Related Post