మన పోలీసులు గ్రేట్! కేసీఆర్

May 19, 2017


img

ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు రాష్ట్ర పోలీస్ అధికారులతో హైదరాబాద్ లో హెచ్.ఐ.సి.సి.లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారిని ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ, “ముందుగా మీ అందరికీ నేను రాష్ట్ర ప్రజల తరపున, ప్రభుత్వం తరపునా పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. ఎందుకంటే మీ అద్భుతమైన పనితీరుతో మన రాష్ట్రానికి జాతీయ స్థాయిలో చాలా మంచి పేరు తెచ్చిపెట్టారు. నేను, హోంమంత్రిగారు, హోం సెక్రెటరీగారు, డిజిపిగారు ఎప్పుడు డిల్లీ వెళ్ళినా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ మీ పనితీరు గురించి మాట్లాడి ప్రశంసిస్తుంటారు. అది విని మాకు ఎంత సంతోషం కలుగుతుందో మాటలలో చెప్పలేము. మీ వలన మన రాష్ట్రానికి గొప్ప పేరు వచ్చింది. మీరు మన రాష్ట్రానికి గర్వకారణం,” అని అన్నారు. అప్పుడు ఆ సమావేశంలో పాల్గొన్న పోలీస్ అధికారులు ఏవిధంగా స్పందించి ఉంటారో తేలికగానే ఊహించుకోవచ్చు. 

తెలంగాణా పోలీసుల ఫ్రెండ్లీ పోలీసింగ్ గురించి తన అభిప్రాయం చెపుతూ, “నేను డిల్లీ వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం గురించి కూడా అక్కడ పలువురి నోట ప్రశంశలు వింటుంటాను. ఇదేవిధంగా మీరు పనిచేస్తూ ప్రజల సహకారంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలని కోరుతున్నాను,” అని అన్నారు.

పోలీసుల సమస్యల గురించి మాట్లాడుతూ, “ఆ మద్యన ఓసారి ఎప్పుడో ఖమ్మం, భూపాలపల్లిలో పర్యటించినప్పుడు అక్కడి పోలీస్ స్టేషన్లలో మహిళా పోలీసులతో మాట్లాడాను. “మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేవా అమ్మా?” అని అడిగినప్పుడు వారు తమ ఇబ్బందులను చెప్పుకొన్నారు. రాష్ట్రంలో నేరాలను అదుపు చేసి శాంతిభద్రతలను కాపాడటం ఎంత ముఖ్యమో, అందుకోసం రేయనక పగలనకా పనిచేస్తున్నా పోలీసులకు కనీస సదుపాయాలు కల్పించవలసిన బాధ్యత కూడా మా ప్రభుత్వంపైనే ఉంది. ముఖ్యంగా మహిళా పోలీసులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని నేను హోంమంత్రిగారు, హోం సెక్రెటరీ గారు, డిజిపిగారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అవసరమైతే వాటి కోసం అదనంగా నిధులు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నాను,” అని అన్నారు. 

“ఉద్యోగంలో ఉన్నప్పుడు మీకు సకాలంలో జీతాలు పెంచుతూ, ప్రమోషన్లు ఇస్తూ, అవసరమైన ఆధునిక ఆయుధాలు, వాహనాలు, సదుపాయాలు అన్నీ కల్పించడం మా బాధ్యత. వాటి కోసం మీరు పైరవీలు చేయనవసరం లేదు. అది మా బాధ్యత. అలాగే పదవీ విరమణ చేసినవెంటనే మీకు రావలసినవన్నీ చెల్లించడం కూడా మా ప్రభుత్వం భాద్యతే. రిటైర్ అయిన తరువాత పించన్ల కోసం కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం చాలా తప్పు. ఎవరు ఎప్పుడు రిటైర్ అవుతారో..వారికి ఎంత డబ్బు చెల్లించవలసి ఉందో, వారికి నెలనెలా ఎంత పెన్షన్ చెల్లించవలసి ఉందో మొదలైన రికార్డులన్నీ ఎప్పటికప్పుడు సిద్దం చేసి ఉంచుకొంటే అటువంటి దుస్థితి ఉండదు. రిటైర్ అయిన వారిని పోలీస్ వాహనంలోనే తోడ్కొని వెళ్ళి సగౌరవంగా వారి ఇంటి వద్ద దింపి రావాలి. ఇన్నేళ్ళుగా వారు చేసిన సేవలకు వారి పట్ల మనం ఆ మాత్రం గౌరవం చూపడం మన ధర్మం,” అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర పోలీసుల పనితీరు మెరుగుపరుచుకోవడానికి అవసరమైన దిశానిర్దేశం చేశారు. తన ప్రసంగంతో వారిలో ప్రేరణ కలిగించగలిగారు. వారి సాధకబాధకాల గురించి చాలా లోతుగా మాట్లాడి వారి సమస్యల పట్ల ఆయన పూర్తి అవగాహన ఉందనే అభిప్రాయం వారిలో కలిగించారు. వారు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న జీతాల పెంపు, ప్రమోషన్లు, పించన్లు, సదుపాయాల గురించి మాట్లాడి వారిలో నూతనోత్సాహాన్ని నింపగలిగారు. అందుకే ఆయన ప్రసంగిస్తున్నంత సేపు పోలీస్ అధికారులు చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మనసు విప్పి మాట్లాడుతూ అవతలి వారి మనసులు దోచుకొనే విధంగా మాట్లాడారు. దటీజ్ కేసీఆర్! 


Related Post