ఇలా అయితే ఆయన ఎప్పటికైన గెడ్డం గీసుకోగలరా?

May 19, 2017


img

“బంగారి తెలంగాణా కోసం రాజకీయశక్తుల పునరేకీకరణ”కు బలైపోయిన టీ-కాంగ్రెస్, ఇప్పుడు భాజపా కోసం బలికాబోతోందా? అంటే అవుననే అనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో నుంచి తెరాస తనకు అవసరమైన నేతలను పట్టుకుపోయిన తరువాత మళ్ళీ ఇప్పుడిప్పుడే కోలుకొంటున్న కాంగ్రెస్ ఇప్పుడు భాజపా నుంచి మళ్ళీ అదే సమస్య ఎదుర్కోవలసి రావడం విచిత్రం. 

వచ్చే ఎన్నికలలో ఎలాగైనా గెలిచి తెలంగాణాలో అధికారంలోకి రావాలని తహతహలాడుతున్న భాజపాకు బలమైన నేతలు లేరనే సంగతి అర్ధం చేసుకొన్నట్లే ఉంది. అందుకే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మాట్లాడుతూ “ ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధి, మా పార్టీ ఆశయాలు, సిద్దాంతాలు నచ్చి మా పార్టీలో చేరాలనుకొనే ఇతర పార్టీల నేతలను ఎవరినైనా సాదరంగా ఆహ్వానిస్తాము,” అని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణాలో తెరాస కాకుండా కంటికి కనబడుతున్నది కాంగ్రెస్ పార్టీయే కనుక లక్ష్మణ్ చెపుతున్న ఆ ‘ఇతర పార్టీలు’ అంటే కాంగ్రెస్ అని అర్ధం అవుతోంది. 

టిపిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “మోడీ దేశాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసేస్తున్నారని, ఆయన పేరుతోనే తాము గెలిచేస్తామని భాజపా నేతలు ఒక పక్క గొప్పలు చెప్పుకొంటూ, మళ్ళీ మరోపక్క రాష్ట్రంలో మా కాంగ్రెస్ నేతల ఇళ్ళ చుట్టూ తిరుగుతూ భాజపాలో చేరమని మా కాళ్ళు ఎందుకు పట్టుకొంటున్నారు?” అని ప్రశ్నించారు. అంటే కాంగ్రెస్ నేతలను భాజపాలోకి రప్పించేందుకు తెర వెనుక ముమ్మురంగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు స్పష్టం అవుతోంది. అదే జరిగితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి ఎలా వస్తుంది? ఉత్తం కుమార్ రెడ్డి గెడ్డం ఎప్పుడు గీసుకోవాలి?   


Related Post