జగన్ కు ప్రధాని అపాయింట్మెంట్..దేనికి సంకేతం?

May 10, 2017


img

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బుదవారం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయ్యి రాష్ట్రానికి సంబంధించిణ సమస్యల గురించి మాట్లాడారు. షరా మామూలుగా ఏపి సిఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్, తెదేపా సర్కార్ పై అనేక పిర్యాదులు చేశారు.

మిర్చి రైతులు, అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు గురించి ప్రధాని నరేంద్ర మోడీకి వివరించి వారిని ఆదుకోవలసిందిగా కోరారు. అగ్రిగోల్డ్ వ్యవహరంలో నారా లోకేష్ తో సహా మంత్రులు, తెదేపా నేతలపై ఆరోపణలున్న కారణంగా దానిపై సిబిఐ విచారణ జరిపించాలని జగన్ కోరారు. ఈ సందర్భంగా రెండేళ్ళ చంద్రబాబు అవినీతిపాలనని వివరిస్తూ వైకాపా ప్రచురించిన “ఎంపరర్ ఆఫ్ కరెప్షన్” అనే పుస్తకాన్ని జగన్ స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ చేతికి ఇచ్చారు.

వైకాపా నుంచి తెదేపాలోకి ఫిరాయించిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టడంపై కూడా ప్రధానికి జగన్ పిర్యాదు చేశారు. ఏపికి ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రంలో చాలా గట్టిగా మాట్లాడే జగన్, దానిపై పునరాలోచించవలసిందిగా ప్రధాని నరేంద్ర మోడీని కోరినట్లు తెలిపారు.

ప్రధాని అడుగక ముందే ఎన్డీయే కూటమి నిలబెట్టబోయే రాష్ట్రపతి అభ్యర్ధికే తమ పార్టీ మద్దతు ఇస్తుందని జగన్ ప్రధాని నరేంద్ర మోడీకి హామీ ఇచ్చారు. తమ మద్దతు అవసరం కనుకనే ప్రధాని నరేంద్ర మోడీ ఈసారి అపాయింట్మెంట్ ఇచ్చారా? అనే విలేఖరి ప్రశ్నకు “ప్రధానమంత్రి అంత గొప్ప హోదాలో ఉన్న వ్యక్తి ఇంత చిన్న విషయంలో నా సహకారం ఆశించి అపాయింట్మెంట్ ఇవ్వవలసిన అవసరం ఏమిటి?” అని జగన్ ఎదురు ప్రశ్నించారు.

“‘మీ పిర్యాదులు, సూచనలు, అభ్యర్ధనలకు ప్రధాని నరేంద్ర మోడీ సానుకూలంగా స్పందించారా?” అనే విలేఖరి ప్రశ్నకు, “ఆయన ఏవిధంగా స్పందించారనేది ముఖ్యం కాదు. ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా రాష్ట్ర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వాటి పరిష్కరించమనికోరడం, ప్రభుత్వంపై ఒత్తిడి చేయడమే మా పని. ఈ పని చేయవలసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వేసవి తాపాన్ని భరించలేక అమెరికాకు వెళ్ళిపోయారు. అందుకే ఆయన చేయవలసిన పనిని నేను చేయవలసివస్తోంది,” అని అన్నారు.

ప్రత్యేక హోదా అంశంపై తమను, మిత్రపక్షమైన తెదేపాను కూడా ఇబ్బంది పెడుతున్న జగన్మోహన్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇవ్వడం ఆశ్చర్యకరమైన విషయమే. బహుశః తాము నిలబెట్టబోతున్న రాష్ట్రపతి అభ్యర్ధికి వైకాపా మద్దతు అవసరం గనుకనే జగన్ ను కలిసేందుకు మోడీ అంగీకరించారేమో? కానీ ఆయన జగన్ పిర్యాదులు, వినతులను చెత్తబుట్టలో పడేస్తారని జగన్ మాటలలోనే స్పష్టం అవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ సానుకూలంగా స్పందించారని జగన్ గట్టిగా చెప్పలేకపోవడం అదే సూచిస్తోంది.

ఏమైనప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, తెదేపా నేతలకు చాలా ఇబ్బంది కలిగించే అనేక క్లూలు జగన్ ప్రధాని నరేంద్ర మోడీకి అందించి వచ్చారు కనుక అవి రాష్ట్ర భాజపాకు, కేంద్రప్రభుత్వానికి తెదేపాను డ్డీ కొనవలసి వచ్చినప్పుడు బలమైన ఆయుధాలుగా ఉపయోగపడతాయి. జగన్ తన శత్రువు (చంద్రబాబు నాయుడు)ను ప్రత్యక్షంగా దెబ్బతీయలేకపోయినా, ఆ సత్తా ఉన్న మోడీ చేతికి ఆయుధాలు అందించి వచ్చారు కనుక దానితో తృప్తి పడవచ్చు.            


Related Post