తెలంగాణా సోషల్ డెవెలప్మెంట్ రిపోర్ట్-2017

May 10, 2017


img

తెలంగాణా సోషల్ డెవెలప్మెంట్ రిపోర్ట్-2017లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. తెలంగాణాలో రాష్ట్రంలో గల కుటుంబాలలో 1.5 శాతం పూర్తిగా రేషన్ కార్డుల మీద ఇచ్చే బియ్యం, పప్పొప్పులు, నూనె, పంచదార వంటి ఆహారవస్తువులపైనే ఆధారపడి జీవిస్తున్నారుట. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాలలోనే ఎక్కువగా రేషన్ షాపులలో ఇచ్చే సబ్సిడీ బియ్యంపై ఆధారపడి ఉన్నారుట.

గ్రామీణ ప్రాంతాలలో మొత్తం బియ్యం వాడుకలో దాదాపు 32 శాతం రేషన్ దుఖాణాలలో తెల్ల రేషన్ కార్డుల మీద ఇచ్చే బియ్యమే ఉపయోగించుకొంటున్నారుట. వారిలో అత్యధికంగా ఎస్సీ, ఎస్టీలు 28 శాతం, బిసిలు 26 శాతం, ఓబిసిలు 19 శాతం బియ్యాని ఉపయోగించుకొంటున్నారుట. కానీ దళితులు, గిరిజనులలో సుమారు 1/5వంతు మందికి నేటికీ తెల్ల రేషన్ కార్డులు లేవుట. తెల్లకార్డులపై ఇస్తున్న జోవార్ దళిత కుటుంబాలకు ముఖ్య ఆహారంగా ఉందని నివేదికలో పేర్కొనబడింది. ఈ గణాంకాలను బట్టి సబ్సిడీ ధర మీద ప్రభుత్వం అందిస్తున్న బియ్యం చాలా మందికి జీవనాధారంగా ఉందని, తెల్ల రేషన్ కార్డుల వలన గ్రామాలలో నిరుపేదలకు చాలా మేలు జరుగుతోందని అర్ధం అవుతోంది.

ఇక పట్టణ ప్రాంతాలలో కేవలం ఆ 16 శాతం బియ్యం మాత్రమే ఉపయోగించుకొంటున్నారుట. పట్టణ ప్రాంతాలలో తెల్ల రేషన్ కార్డులపై ఇచ్చే బియ్యం కంటే పంచదార, పప్పుపులు, నూనెలకు ఎక్కువ డిమాండ్ ఉంటోంది. పట్టణ ప్రాంతాలలో ఉద్యోగం, ఉపాధి అవకాశాలు ఎక్కువ గనుక ఆదాయం కూడా బాగానే ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న మొత్తం రేషన్ కార్డులలో తెల్ల రేషన్ కార్డులు 84.2 శాతం ఉండగా, అంత్యోదయ కార్డులు 2.7 శాతం వరకు ఉన్నట్లు నివేదికలో పేర్కొనబడింది.


Related Post