అదీ దానిలాగే మూలపడుతుందా?

May 02, 2017


img

ప్రభుత్వాలు చట్టాలు చేయడం సులువేమో కానీ వాటి అమలు చేయడం చాలా సంక్లిష్టమైన పనే అని చెప్పక తప్పదు. ఉదాహరణకు యూపియే ప్రభుత్వం భూసేకరణ చట్టం-2013ను తెచ్చింది. కానీ ఇంతవరకు దేశంలో ఎక్కడా అది యధాతధంగా అమలుచేయలేకపోయారు. నిర్వాసిత రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు దానిలో ఏర్పాటు చేసిన కటినమైన నిబంధనలే అందుకు కారణం.

మోడీ సర్కార్ వాటిని సరళీకరించేందుకు చేసిన ప్రయత్నాలను కాంగ్రెస్ అడ్డుకోవడంతో అవేవీ ఫలించలేదు. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు భూసేకరణ చట్టాలు చేసుకొంటున్నప్పటికీ సమస్యలు అలాగే ఉన్నాయి. తత్ఫలితంగా ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేయడం కష్టంగా మారి ప్రతిష్టంభన ఏర్పడింది. తెలంగాణాలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఇటీవల తెరాస సర్కార్ ప్రతిపాదించిన బీసి-ఈ బిల్లుని భాజపా వ్యతిరేకిస్తోంది కనుక బహుశః దానికీ అదే గతి పట్టవచ్చు.

కేంద్రప్రభుత్వం తాజాగా రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ (ఆర్.ఈ.ఆర్.ఏ.) చట్టాన్ని అమలులోకి తెచ్చింది. బహుశః దానికీ అదే గతి పడుతుందేమో? ఎందుకంటే భూసేకరణ చట్టం-2013లో నిర్వాసిత రైతుల హక్కులు, ప్రయోజనాలను కాపాడేందుకు చాలా కటినమైన నిబంధనలు పొందుపరిస్తే, ఈ ఆర్.ఈ.ఆర్.ఏ. చట్టంలో ఇళ్ళు, ఫ్లాట్స్ కొనుగోలుదార్ల హక్కులు, ప్రయోజనాలను కాపాడేందుకు చాలా కటినమైన నిబంధనలు పొందుపరచబడ్డాయి. కనుక ఈ కొత్త చట్టం ఆచరణ సాధ్యమో కాదో చూడాలి. 

ఈ కారణంగా సహజంగానే ఈ చట్టం వలన భవన నిర్మాణరంగంలో ఉన్నవారిపై తీవ్ర ఒత్తిడి కలుగుతుంది. కనుక ఈ చట్టంలో ఉన్న కటినమైన నిబందనలను రాష్ట్ర ప్రభుత్వాలు సరళీకరించక తప్పదు. అదే జరిగితే ఈ చట్టం వలన ఆశించిన ప్రయోజనం నెరవేరదు.

ఈ బిల్లును రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించి తమ అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా అన్వయించుకొంటూ చట్టాలు చేసుకోవలసి ఉంటుంది. ఇంతవరకు ఈ కొత్త చట్టానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఓడిశా, బిహార్ రాష్ట్రాలు మాత్రమే ఆర్.ఈ.ఆర్.ఏ.చట్టాన్ని నోటిఫై చేసి స్వీకరించాయి. తెలంగాణా, కర్నాటక రాష్ట్రాలు ముసాయిదా చట్టాలను సిద్దం చేసుకొన్నాయి కానీ వాటిని ఇంకా ఆమోదించవలసి ఉంది. దీనిని అమలుచేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు స్వంత రెగ్యులేటరీ సంస్థలను, న్యాయవివాదాలు ఏర్పడితే పరిష్కరించేందుకు అప్పీలేట్ కోర్టులను ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది.

అభివృద్ధి చెందిన చాలా దేశాలలో ఇటువంటి చట్టాలు చాలా కాలంగా అమలులో ఉన్నాయి. కానీ అవినీతి, అలసత్వం, రాజకీయ ఒత్తిళ్ళు, వినియోగదారుల హక్కులకు గౌరవం చూపని నైజం వంటి సకల అవలక్షణాలు కలిగి ఉన్న భారత్ వంటి దేశంలో సంక్లిష్టమైన ఈ చట్టం అమలుచేయడం సాధ్యమా కాదా అనేది కాలమే సమాధానం చెప్పాలి. 


Related Post