భూసేకరణపై భాజపా వైఖరి ఏమిటో ?

May 01, 2017


img

భూసేకరణ కోసం తెరాస సర్కార్ తెచ్చిన జివో:123కి ఎదురుదెబ్బలు తగులుతుండటం చేత, కేంద్రప్రభుత్వం సూచన మేరకు దానికి కొన్ని సవరణలను చేసి ఆదివారం వాటికి శాసనసభ, మండలి చేత ఆమోదముద్ర వేయించుకొంది. దానిపై ఉభయసభలలో ఎటువంటి చర్చ జరపకుండా ప్రతిపక్షాలను ఖాతరు చేయకుండా ఆమోదించడాన్ని భాజపా ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. 

“తెరాస సర్కార్ చాల అప్రజాస్వామికంగా, నిరంకుశంగా వ్యవహరిస్తోంది. రైతుల భూములను బలవంతంగా గుంజుకొనేందుకే ఈ చట్ట సవరణలు చేసింది. దాని ప్రయత్నాలను మేము అడ్డుకొంటాము. అవసరమైతే హైకోర్టు తలుపులు తట్టి రైతులకు ప్రభుత్వం వలన హాని జరుగకుండా కాపాడుకొంటాము,” అని అన్నారు.

భూసేకరణ చట్టానికి కేంద్రప్రభుత్వం సూచనల మేరకే సవరణలు చేస్తున్నామని తెరాస సర్కార్ చెపుతోంది. అంతేకాదు..ఈ చట్టం అమలులోకి వస్తే ప్రతిపక్షాలు ఇక దానిపై కోర్టులలో పిటిషన్లు వేయలేవని నమ్మకంగా చెపుతోంది. కేంద్రప్రభుత్వమే ఆ చట్టానికి ఫలాన సవరణలు చేయమని చెప్పినపుడు రాష్ట్ర భాజపా దానిని ఎందుకు వ్యతిరేకిస్తోంది? పైగా దీనిని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళతామని కూడా చెపుతోంది. అంటే దీనిపై కేంద్రం వైఖరి, రాష్ట్ర భాజపా వైఖరి భిన్నంగా ఉండబోతున్నాయా..లేక ఈ చట్టాన్ని కూడా కేంద్రప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్ బిల్లులాగే పక్కనపెట్టబోతోందా? అనే సందేహాలకు కిషన్ రెడ్డే సమాధానం చెపితే బాగుంటుంది. 

ఈ బిల్లుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సవరణలపై ఉభయసభలలో చర్చ జరుపనందుకు కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం తప్పు కాదు కానీ ప్రభుత్వం చేసిన సవరణలను గుడ్డిగా వ్యతిరేకిస్తామని చెప్పడమే సబబుగా లేదు. 


Related Post