భాజపా గొప్ప అవకాశాన్ని జారవిడుచుకొందా?

April 24, 2017


img

గత 41 రోజులుగా డిల్లీలో జంతర్ మంతర్ వద్ద రోజుకొక విధంగా వినూత్నంగా ధర్నాలు చేస్తున్న తమిళనాడుకు చెందిన రైతులు నిన్న డిల్లీ వచ్చిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి హామీతో తాత్కాలికంగా ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు. యూపి, ఏపి, తెలంగాణా రాష్ట్రాలలో రైతులకు పంట రుణాలను మాఫీ చేసినట్లే తమవీ మాఫీ చేయాలని, ఇంకా కొన్ని దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వారు మార్చి 13 నుంచి డిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద నిరవధిక ధర్నాలు చేస్తున్నారు. కానీ కేంద్రప్రభుత్వం వారిమోర ఆలకించలేదు. కేంద్రమంత్రులు ఎవరూ వారివైపు ఒక్కసారి కూడా కనెత్తి చూడలేదు. 

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన డిల్లీలో నిన్న జరిగిన నీతి అయోగ్ సమావేశంలో దేశంలో రైతుల పరిస్థితులు మెరుగుపరచాలని, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్రాలను కోరిన ప్రధాని నరేంద్ర మోడీ, డిల్లీలోనే 41 రోజులుగా ధర్నా చేస్తున్న రైతులను ఎందుకు పట్టించుకోలేదో తెలియదు. 

ఆయన స్వయంగా వెళ్ళి వారి గోడు విని, వారికి భరోసా కల్పించి ఉంటే వారు చాలా సంతోషించి ఉండేవారు. తమిళనాడు ప్రజలకు ప్రధానిపై మంచి అభిప్రాయం ఏర్పడి ఉండేది. కనీసం ఆయన ప్రతినిధి లేదా కేంద్ర వ్యవసాయ మంత్రి వెళ్ళి వారితో మాట్లాడి ఉండి ఉంటే బాగుండేది.

తమిళనాడులో అడుగుపెట్టాలని తహతహలాడుతున్న భాజపాకు కూడా చాలా మేలు కలిగేది. ఆ రాష్ట్రంలో అధికార పార్టీలో ఏర్పడిన రాజకీయ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకొని రాష్ట్ర రాజకీయాలపై పట్టు సాధించాలని కేంద్రప్రభుత్వం ఆలోచిస్తూ పావులు కదుపుతోందే తప్ప తన కళ్ళ ముందున్న ఈ గొప్ప అవకాశాన్ని చూడలేకపోయింది. వారేమీ లక్షల కోట్లు ఇమ్మని డిమాండ్ చేయడం లేదు. వారి పంటరుణాల మాఫీకి రూ.39,000 కోట్లు ఇవ్వాలని కోరుతున్నారు. అది కూడా కేంద్రప్రభుత్వం స్వయంగా ఇవ్వనవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే ఇప్పించవచ్చు లేదా మరోవిధంగా ఇప్పించవచ్చు. కానీ ఆ రైతులతో కనీసం మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదు.  

ఈ విధంగా వ్యవహరించి కేంద్రం ఒక గొప్ప అవకాశం కోల్పోవడమే కాకుండా  తమిళరైతుల పట్ల అది ప్రదర్శించిన నిర్లక్ష్యవైఖరి దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతోందనే వాదనకు బలం చేకూర్చినట్లయింది. వారి పట్ల కేంద్రం వ్యవహరించిన తీరు దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు, ముఖ్యంగా తమిళ ప్రజలకి బలమైన తప్పుడు సంకేతాలు పంపించినట్లయింది. ఈ కారణంగా ఒకవేళ ఇక ముందు ఎప్పుడైనా కేంద్రమంత్రులు లేదా భాజపా అగ్రనేతలు తమిళనాడులో పర్యటించినప్పుడు తమిళప్రజల నుంచి పరాభవం ఎదుర్కోవలసి వచ్చినా ఆశ్చర్యం లేదు.    

తమిళరైతుల సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్ళి తప్పకుండా పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి పళనిస్వామి హామీ ఇవ్వడంతో వారు మే25 వరకు తాత్కాలికంగా తమ ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లడేవరకు తాము డిల్లీ నుంచి వెనక్కు తిరిగి వెళ్ళబోమని చెప్పడం విశేషం. 


Related Post