దిగ్గీరాజా చెయ్యి వేస్తే...

April 20, 2017


img

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకొనే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆ పని మీదే రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ నేడు హైదరాబాద్ వస్తున్నారు. ఆయన పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ లో జిల్లాలు వారిగా పార్టీ పరిస్థితిపై సమీక్ష సమావేశాలు నిర్వహించబోతున్నారు. 

దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి శల్యసారద్యం చేస్తూ ఒక్కో రాష్ట్రంలో పార్టీ కార్యాలయాలకు తాళాలు వేసుకొంటూ వస్తున్నారు. మధ్యప్రదేశ్ తో మొదలు పెట్టిన ఆ కార్యక్రమం నేటికీ ఆయన నిరాటంకంగా కొనసాగిస్తూనే ఉన్నారు. 

ఇటీవల జరిగిన గోవా ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ, అయన అలసత్వం ప్రదర్శించడం వలన రెండో స్థానంలో ఉన్న భాజపా అధికారం చేజిక్కించుకొంది. రాష్ట్ర విభజనలో కీలక పాత్ర పోషించిన దిగ్విజయ్ సింగ్ అప్పుడు కూడా పార్టీకి శల్యసారధ్యం చేసి రెండు తెలుగు రాష్ట్రాలలో పార్టీకి తీవ్ర నష్టం కలిగించారు. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు ఉన్నప్పటికీ ఆయన శల్యసారధ్యం కారణంగానే ఓడిపోయిందని చెప్పక తప్పదు. 

రాష్ట్ర విభజన చేస్తున్నందుకు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న ఆంధ్రా ప్రజల వద్దకు వెళ్ళి వారితో పుండు మీద కారం చల్లినట్లు మాట్లాడటంతో అక్కడ కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయింది. ఆ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అక్కడ ఎన్నడూ కోలుకోలేని స్థితికి చేరుకొంది. ఆ క్రెడిట్ దిగ్విజయ్ సింగ్ కే దక్కుతుంది. 

ఇంత జరిగినా కాంగ్రెస్ అధిష్టానం మళ్ళీ ఆయనకే తెలంగాణా బాధ్యతలు అప్పగించడం విశేషం. రాష్ట్ర సమస్యల గురించి, రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి మంచి అవగాహన, పట్టు ఉన్న తెలంగాణాకే చెందిన జైపాల్ రెడ్డి, జానారెడ్డి, ఉత్తం కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, డికె అరుణ, వి హనుమంతరావు, పొన్నం ప్రభాకర్ వంటి హేమహేమీలు ఉండగా కాంగ్రెస్ ను మట్టి కరిపిస్తున్న దిగ్విజయ్ సింగ్ కే రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలు అప్పగించడం టీ-కాంగ్రెస్ నేతల పాలిట శాపంగా, తెరాస, భాజపాలకు వరంగా మారవచ్చు. ఇంతకాలం టీ-కాంగ్రెస్ నేతలు పార్టీని కాపాడుకోవడానికి చేస్తున్న కృషి, ప్రజాసమస్యల పరిష్కారం కోసం తెరాస సర్కార్ తో వారు చేస్తున్న పోరాటాలు అన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా మారవచ్చు. 

డిగ్గీ రాజా చెయ్యి వేస్తే ఏమవుతుందో కళ్ళారా చూస్తున్నారు కనుక తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలంటే ముందుగా వారు ఆయనను రాష్ట్రానికి, పార్టీకి దూరంగా ఉంచడం చాలా మంచిది. 


Related Post