కేసీఆర్, చంద్రబాబు తేల్చుకోవలసిన విషయం అది

April 11, 2017


img

రాష్ట్ర విభజన జరిగి మూడేళ్ళు పూర్తికావస్తున్నా ఇంతవరకు షెడ్యూల్: 10 పరిధిలోకి వచ్చే సంస్థల విభజన ప్రక్రియ పూర్తికాలేదు. ఆ సంగతి తేలితేగానీ హైదరాబాద్ లోని తన అధీనంలో ఉన్న సచివాలయం, శాసనసభ, మండలి తదితర భవనాలను అప్పగించేది లేదని ఏపి సర్కార్ భీష్మించుకొని కూర్చొంది. హైకోర్టు విభజనను కూడా దానితో ముడిపెట్టింది. ఈ సమస్యల పరిష్కారం కోసం గవర్నర్ నరసింహన్ సూచన మేరకు ఇరు రాష్ట్రాలు మంత్రుల కమిటీలు ఏర్పాటు చేసుకొని ఆయన సమక్షంలోనే చాలాసార్లు సమావేశం అయ్యాయి. కానీ అక్కడ కూడా ఈ షెడ్యూల్: 10 సంస్థల విభజనపై నెలకొన్న ప్రతిష్టంభన కారణంగానే ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. 

దీనితో విసుగెత్తిపోయిన తెరాస సర్కార్ షెడ్యూల్: 10 సంస్థల విభజనపై కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరింది. తెరాస ఎంపిలు కవిత, జితేందర్ రెడ్డి, బిబి పటేల్ నిన్న కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి, విభజన చట్టంలోని సెక్షన్ 75 ప్రకారమే షెడ్యూల్: 10 సంస్థల విభజన చేయాలని కోరారు. వాటి విభజనలో ఎదురవుతున్న సమస్యలను, వాటి విభజనలో ఏపి సర్కార్ చేస్తున్న వితండవాదన గురించి వారు హోం మంత్రికి వివరించి, కేంద్రప్రభుత్వమే చొరవ తీసుకొని వీలైనంత త్వరగా షెడ్యూల్: 10 సంస్థల విభజన ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. ఈ విషయంలో తెలంగాణాకు అన్యాయం జరిగితే డిల్లీలోనే పోరాటం ప్రారంభిస్తామని వారు హోంమంత్రిని సున్నితంగా హెచ్చరించారు. హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ వారి అభ్యర్ధనకు సానుకూలంగా స్పందించినట్లు ఎంపి జితేందర్ రెడ్డి చెప్పారు. 

అయితే కేంద్రప్రభుత్వానికి ఈ సమస్యలను పరిష్కరించాలనే చిత్తశుద్ది ఉన్నట్లయితే అది నేరుగా ఏపి సిఎం చంద్రబాబును పిలిపించుకొని మాట్లాడి ఒప్పించి ఉండేది. కానీ తెదేపా-భాజపాల మద్య స్నేహసంబంధాలు, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వాములుగా ఉండటం, ఏపిలో భాజపా రాజకీయ ప్రయోజనాలు వగైరాలను దృష్టిలో పెట్టుకొని ఈ విషయంలో కేంద్రప్రభుత్వం అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తోంది. కనుక ఈ సమస్యకు డిల్లీలో పరిష్కారం దొరకదని చెప్పవచ్చు. గవర్నర్ నరసింహన్ సమక్షంలో కేసీఆర్, చంద్రబాబు మాట్లాడుకొంటేనే సాధ్యం కావచ్చు. కనుక ఈ విషయంలో కేంద్రాన్ని, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ నమ్ముకోవడం కంటే గవర్నర్ నరసింహన్ ను నమ్ముకోవడమే మేలేమో? తెరాస సర్కార్ ఆలోచించాలి. 


Related Post