శభాష్ ముఖ్యమంత్రిజీ!

April 04, 2017


img

యూపి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి తమ రాష్ట్రంలో గోవధపై నిషేధం విదించడం, అనధికార కబేళాలను మూసివేయించడం వంటి నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నప్పటికీ, ఆయన తీసుకొంటున్న పరిపాలనాపరమైన చర్యలు అందరినీ ఆకట్టుకొంటున్నాయి. సమాజ్ వాదీ ప్రభుత్వ హయంలో రాష్ట్రంలో ఎక్కడ చూసిన ఒకరకమైన అరాచక వ్యవస్థ, గూండాయిజం కళ్ళకు కట్టినట్లు కనబడుతుండేది. ఆదిత్యనాద్ యోగి రాకతో అవన్నీ వేగంగా తగ్గుముఖం పడుతున్నాయి. మరొక రెండు నెలలోనే రాష్ట్రంలో అవినీతి, గూండాయిజం వంటి అవలక్షణాలను కనబడకుండా చేస్తానని ముఖ్యమంత్రి యోగి చెపుతున్నారు. తాను పదవులు అధికారం అనుభవించడానికి రాజకీయాలలోకి రాలేదని దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడుకొంటూ ప్రజలకు సేవ చేయాలనే వచ్చానని యోగి చెప్పారు. 

ఆయన మరో విషయం కూడా చెప్పారు. కాషాయ వస్త్రాలు కట్టినంత మాత్రాన్న తాను సమాజంలో ఏదో ఒక వర్గానికి మాత్రమే అనుకూలమని, మిగిలిన వారిని ద్వేషిస్తానని ఎవరూ భావించవద్దని కోరారు. కాషాయం ధరిస్తే ఏదో నేరం చేసినట్లుగా చూడరాదని, కుహానా లౌకికవాదులుగా చెప్పుకొంటున్నవారే కాషాయం ధరించిన వారిని ప్రజలకు బూచిగా చూపిస్తూ వారిలో ఒక అభద్రతాభావం కలిగిస్తున్నారని యోగి అన్నారు. నిజానికి వారు కాషాయ ఫోబియాతో బాధపడుతున్నారని తమాలో నెలకొన్న ఆ అభద్రతాభావాన్నే ప్రజలకు కూడా వ్యాపింపజేయాలని ప్రయత్నిస్తున్నారని యోగి అన్నారు. 

కాషాయం ధరించడం అనేది తన వ్యక్తిగత విషయమని, దానికి తన పనికి ఎటువంటి సంబంధం ఉండదని అన్నారు. తాను సమాజంలో అన్ని కులాలు, మతాలు, వర్గాలకు చెందిన ప్రజలను సమానంగా చూస్తానని యోగి చెప్పారు. కుహన లౌకికవాదం కంటే కాషాయం ధరించినా అన్ని వర్గాల ప్రజలకు సేవ చేయడమే గొప్పదిగా తను భావిస్తానని యోగి చెప్పారు. 

యూపిలో చాలా బారీగా చెరుకు పండిస్తున్నప్పటికీ, రాష్ట్రంలో తగినన్ని చక్కర పరిశ్రమలు ఏర్పాటుకాలేదని, త్వరలోనే 5-6 చక్కెర పరిశ్రమలు స్థాపింపజేస్తానని అన్నారు. రెండు వారాలలోగా చెరుకు రైతుల బకాయిలు అన్నీ చెల్లిస్తామని ప్రకటించారు. అలాగే యూపిలో పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేసేందుకు సరికొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తానని తెలిపారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే అన్ని పరిశ్రమలలో 90 శాతం ఉద్యోగాలు స్థానికులకు దక్కే విధంగా పాలసీని రూపొందిస్తామని యూపి సిఎం ఆదిత్యనాథ్ యోగి చెప్పారు. 


Related Post