మోడీ భజనతో భాజపా గెలవగలదా?

April 04, 2017


img

“ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీకి ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. ముస్లింలు, క్రీస్టియన్లు, ఇతర తెగలవారు అధికంగా ఉండే రాష్ట్రాలలో కూడా భాజపాకే పట్టం కడుతున్నారంటే అది మోడీని చూసే. కనుక వచ్చే ఎన్నికలలో అధికార తెరాస పార్టీకి భాజపా గట్టిపోటీనీయడం ఖాయం. ప్రస్తుతం మజ్లీస్ చేతిలో ఉన్న హైదరాబాద్ లోక్ సభ సీటును దక్కించుకోవడానికి మేము బలమైన వ్యూహం అమలుచేస్తాము. ఏప్రిల్ 7న హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గ భాజపా కార్యకర్తల సమావేశం జరుగబోతోంది. మా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దానికి హాజరయ్యి మార్గనిర్దేశనం చేస్తారు,” అని రాష్ట్ర భాజపా మాజీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ చెప్పారు.    

మోడీ ప్రభావం ఉత్తరాది రాష్ట్రాలపై ఉన్న మాట వాస్తవమే కానీ ఈశాన్య రాష్ట్రాలలో ఉందా లేదా? అనేది చెప్పడానికి ఆ రాష్ట్రాలలో విజయం సాదించడం కొలమానంగా చెప్పుకోలేము. ఉదాహరణకు ఇటీవల ఎన్నికలు జరిగిన గోవా, మణిపూర్ రాష్ట్రాలలో కాంగ్రెస్ మొదటి స్థానంలో, భాజపా రెండవ స్థానంలో నిలిచాయి. రెండు చోట్ల కూడా ఇతర పార్టీ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టి భాజపా అధికారం చేజిక్కించుకొంది. రెండవ స్థానంలో ఉన్న భాజపా ఆవిధంగా అధికారం చేజిక్కించుకోవడం అనైతిక చర్యేనని అందరికీ తెలుసు. అందుకు సిగ్గుపడవలసిన భాజపా నేతలు దానిని ఒక గొప్ప వ్యూహమని, తమకే ప్రజాధారణ ఉందని గొప్పలు చెప్పుకొంటున్నారు. అయితే తెలంగాణాలో భాజపా పప్పులు ఉడకవని ఇప్పటికే పలుమార్లు నిరూపితం అయింది. 

కర్నాటకలో ఇదివరకు భాజపా అధికారంలో ఉండేది కనుక భవిష్యత్ లో మళ్ళీ అక్కడ వచ్చే అవకాశం ఉంటుందేమో కానీ  తెలంగాణా, ఆంధ్రా, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో కూడా ఇప్పట్లో అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని అందరికీ తెలుసు..ఆ పార్టీ నేతలకు కూడా తెలుసు. వాటి కారణాలు కూడా అందరికీ తెలుసు. అయినా భాజపా నేతలు మోడీ భజనతో తెలంగాణాలో అధికారంలోకి వచ్చేయవచ్చనే భ్రమలో ఉంటూ ఆత్మవంచన చేసుకొంటూ కాలక్షేపం చేసేస్తే ఎవరు కాదంటారు?


Related Post