వైకాపా అలా.. తెదేపా ఇలా..

March 31, 2017


img

ఏపి శాసనసభ సమావేశాలు నేటితో ముగుస్తాయి. గత 10 రోజులుగా జరుగుతున్న సమావేశాలలో అధికార, ప్రతిపక్షాల సభ్యులు ప్రజా సమస్యల పరిష్కారం కోసం లేదా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ బిల్లులపైనో లోతుగా చర్చించి ఉంటే ఆ సమావేశాలకు ఏమైనా అర్ధం, ప్రయోజనం ఉండేది. కానీ అధికార, ప్రతిపక్షాలు పరస్పరం నిందించుకొంటూ, సవాళ్ళు విసురుకొంటూ కాలక్షేపం చేసేశాయి. ఈ సమావేశాలలో అవి శాసనసభను తమ రాజకీయాలకు వేదికగా మార్చుకొనేందుకే తీవ్రంగా ప్రయత్నించాయి. 

ఉదాహరణకు వైకాపా ఏదో ఒక అతిముఖ్యమైన సమస్యపై వాయిదా తీర్మానం ఇవ్వగానే అది అజెండాలో లేదనో లేకపోతే వైకాపాకు సభా నియమాలు తెలివనే సాకుతోనో దానిని స్పీకర్ తిరస్కరిస్తారు. అందుకు నిరసనగావై సభ్యులు  స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేస్తూ సభను స్తంభింపజేసతారు. తద్వారా ప్రజా సమస్యలపై చర్చించడానికి తెదేపా సర్కార్ వెనుకాడుతోందని ప్రజలకు నిరూపించి, దానిని ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. 

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అప్పుడు వైకాపా సభ్యుల తీరును తెదేపా సభ్యులు తీవ్రంగా ఖండిస్తూనే ఉంటారు. వారిపై కటిన చర్యలు తీసుకోవలసిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహామంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ స్పీకర్ కోడెలను కోరుతుంటారు కానీ ఆయన వారిపై చర్యలు తీసుకోరు! 

వైకాపా సభ్యులు స్పీకర్ ను చుట్టుముట్టి నినాదాలు చేస్తుండగానే ఆయన వాటిని పట్టించుకోకుండా సభా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అదంతా టీవీ ఛానళ్ళలో రాష్ట్ర ప్రజలందరూ చూస్తూనే ఉంటారు కనుక వైకాపా సభ్యుల తీరు పట్ల వారికి దురాభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది. బహుశః ఇది తెదేపా కొత్తరకం వ్యూహం కావచ్చు. లేకుంటే వైకాపా సభ్యులను స్పీకర్ ఎప్పుడో సస్పెండ్ చేసి ఉండేవారు కదా? 

ప్రభుత్వానికి ఇబ్బందికరమైన ప్రశ్నలను వైకాపా వేస్తే వెంటనే చంద్రబాబు మంత్రి అచ్చెం నాయుడుకి, ఆయన స్పీకర్ కి సైగలు చేస్తారని, ఆయన వెంటనే సభను వాయిదా వేసేస్తుంటారని జగన్ ఆరోపించారు. అలాగే జగన్ తనకు ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తితే ఆయన తన సభ్యులకు సైగ చేస్తారని, వెంటనే వారు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి గొడవ మొదలుపెడతారని తెదేపా ఆరోపిస్తుంటుంది.   

ఈవిధంగా తెదేపా, వైకాపాలు రెండూ కూడా తమ ప్రత్యర్ధిని దెబ్బతీస్తూ, ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని ప్రయత్నించాయే తప్ప ఏ ఒక్క సమస్యను పరిష్కరించడానికి శ్రద్ధ చూపలేదని చెప్పక తప్పదు. 


Related Post