జగన్ వెనుకే పవన్...దేనికి?

March 30, 2017


img

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక తీవ్రమైన సమస్యను తీసుకొని పోరాటం మొదలుపెట్టగానే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా రంగంలో దిగుతుంటారు. ఏదో ఒకటిరెండుసార్లు జరిగితే అది యాదృచ్చికమని సరిపెట్టుకోవచ్చు. కానీ చాలాసార్లు జరుగుతుండటంతో అనుమానాలకు తావిస్తోంది. అమరావతి భూసేకరణ, ప్రత్యేక హోదా, ఆక్వా ఫుడ్ పార్క్, అగ్రిగోల్డ్...మొదలైన పోరాటాల వలన తెదేపా ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినప్పుడే పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దిగుతున్నట్లు కనిపిస్తోంది. 

జగన్మోహన్ రెడ్డి అగ్రిగోల్డ్ వ్యవహారంపై బాబు సర్కారుని శాసనసభలో గట్టిగా నిలదీసిన సంగతి తెలిసిందే. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వంటి తెదేపా నేతలు అగ్రిగోల్డ్ యాజమాన్యంతో కుమ్మక్కు అయినందునే భాధితులకు న్యాయం చేయడంలేదని జగన్ ఆరోపించారు. అప్పుడు తెదేపా సభ్యులు యధాప్రకారం వేరే అంశం లేవనెత్తి జగన్ నోరును మూయించగలిగారు కానీ అగ్రిగోల్డ్ భాధితుల ఆగ్రహాన్ని చల్లర్చలేకపోయారు. ఇంతకాలం అసంఘటితంగా పోరాడుతున్న అగ్రిగోల్డ్ భాధితులందరూ ఇప్పుడు ఒకే వేదికపైకి వచ్చి పోరాటం మొదలుపెట్టడంతో బాబు సర్కార్ పై ఒత్తిడి పెరిగింది. 

ఇంతకాలం వారి ఊసు ఎత్తని పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా నేడు విజయవాడ వచ్చి యధాప్రకారం ప్రభుత్వంపై కొన్ని విమర్శలు చేయడం అనుమానం కలిగిస్తోంది. గతంలో రాజధాని భూములు, ప్రత్యేక హోదా, ఆక్వా ఫుడ్ పార్క్ వంటి విషయాలలో కూడా పవన్ కళ్యాణ్ ఇదే విధంగా ప్రభుత్వంపై విమర్శలు చేసి చేతులు దులుపుకొన్నారు. ఆ తరువాత ప్రభుత్వం యధాప్రకారం ముందుకు సాగిపోయింది. అయినా పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి అడ్డుపడేప్రయత్నం చేయలేదు. కనుక పవన్ కళ్యాణ్ భాధితుల కోసం కాక ప్రభుత్వాన్ని ప్రతిపక్షాల బారి నుంచి కాపాడటానికే వచ్చినట్లు కనిపిస్తోంది. ఇంకా పచ్చిగా చెప్పుకోదలిస్తే జగన్ పోరాటాలను హైజాక్ చేయడానికే వస్తున్నట్లు అనిపిస్తోంది. ఒక అంశంపై జగన్ విమర్శించినపుడు చాలా తీవ్రంగా స్పందించే తెదేపా నేతలు, అదే అంశంపై పవన్ విమర్శిస్తే అసలు చీమకుట్టినట్లుగా కూడా బాధపడకపోవడం కూడా చాలా ఆలోచింపజేస్తుంది. 

జగన్ తన పోరాటాలతో ప్రభుత్వం మెడలువంచలేకపోతున్నప్పుడు, ఆ పోరాటాలను అందిపుచ్చుకొంటున్న పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఆ సమస్యలను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు? ఆయన కూడా హామీలు, విమర్శలతోనే సరిపెట్టేస్తున్నారెందుకు? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఈవిధంగా వ్యవహరిస్తే ప్రజలలో తన విశ్వసనీయత కోల్పోవడం ఖాయం. అప్పుడు జనసేన కధ కూడా మరో ప్రజారాజ్యం కధలాగే ముగుస్తుంది. 

ఈరోజు జరిగిన సమావేశంలో అగ్రిగోల్డ్ భాధితులు తమ సమస్యలను పవన్ కళ్యాణ్ కు మోరపెట్టుకొని కన్నీళ్ళు పెట్టుకొంటుంటే, పవన్ కళ్యాణ్ అభిమానులు ఈలలు వేస్తూ చిందులు వేయడం దిగ్బ్రాంతి కలిగిస్తుంది. ఇతర హీరోలా సినీ కార్యక్రమాలలో వారి అనుచిత ప్రవర్తన వలన ఇప్పటికే పవన్ కళ్యాణ్ తీరని అప్రదిష్ట మూటగట్టుకొంటున్నారు. ఇటువంటి సందర్భాలలో కూడా వారు ఈవిధంగా వ్యవహరిస్తే అది ఆయనకే ఇంకా తలవంపులు కలిగిస్తుంది. 


Related Post