నత్తనడకన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం

March 30, 2017


img

2014 ఎన్నికల సమయంలో తెరాస అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీని సవరించి రాష్ట్రంలో రెండు లక్షల ఇళ్ళు నిర్మిస్తామని లేకుంటే వచ్చే ఎన్నికలలో ప్రజలను ఓట్లు అడగబోమని కేసీఆర్ చెపుతున్నారు. కానీ ఈ రెండున్నరేళ్ళలో కేవలం 1217 ఇళ్ళు మాత్రమే నిర్మించామని సాక్షాత్ ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ శాసనసభలో తెలిపారు. మరో 9,588 ఇళ్ళ నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు.  

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ కోసం మంత్రులు, ఎంపిలు, ప్రజా ప్రతినిధులు రాష్ట్రంలో వేసిన శిలాఫలకలు దిష్టిబొమ్మల్లాగా తెరాస సర్కార్ ను వెక్కిరిస్తూ కనబడుతుంటాయి. నిజామాబాద్ ఎంపి కవిత తన నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణానికి శంఖుస్థాపన చేసి రెండేళ్ళపైనే అవుతోంది. కానీ ఇంతవరకు నిర్మాణపనులు మొదలుకాలేదు. 

త్వరలోనే హైదరాబాద్ లో 60,000 ఇళ్ళకు టెండర్లు ఖరారు చేసి వెంటనే నిర్మాణపనులు మొదలుపెడతామని మంత్రి కేటిఆర్ చెప్పారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలో లక్ష ఇళ్ళు,  మిగిలిన అన్ని జిల్లాలలో కలిపి మరో లక్ష ఇళ్ళు నిర్మిస్తామని తెరాస సర్కార్ చెపుతోంది.

ఈవిధంగా హామీలకు, వాటిపై ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు, ఆచరణకు ఎక్కడా పొంతన కనబడకపోవడం వలననే ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. రెండున్నరేళ్ళ 1217 ఇళ్ళు మాత్రమే కట్టించి వాటినే చూపిస్తూ తెరాస సర్కార్ ప్రజలను మభ్యపెడుతోందని కాంగ్రెస్, భాజపా నేతలు విమర్శిస్తున్నారు. 

మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి బారీ ప్రాజెక్టులు చాలా జోరుగా సాగుతున్నందున కాంట్రాక్టర్లు ఈ పనులు చేపట్టడానికి ఆసక్తి చూపడం లేదని, ఎందుకంటే వీటిలో పెద్దగా లాభం ఉండదని మంత్రి ఈటెల స్వయంగా చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. 

ఖమ్మం జిల్లాలోమంత్రి తుమ్మల నాగేశ్వరరావు దత్తత తీసుకొన్న మద్దులపల్లి గ్రామంలో నిర్మించిన 22 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను నిన్న ఉగాది సందర్భంగా లబ్దిదారులకు అందజేశారు. అదే గ్రామంలో నిర్మించిన పంచాయితీ కార్యాలయం, దోబీఘాట్ లను కూడా నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల రైతులకు సాదాబైనామా పట్టాలను అందజేశారు. ఈ లెక్కన ఇళ్ళ నిర్మాణం సాగుతుంటే మిగిలిన రెండున్నరేళ్ళలో తెరాస సర్కార్ రెండు లక్షల ఇళ్ళయినా నిర్మించగలదా? అనే అనుమానం కలుగుతోంది.  


Related Post