మన తెలంగాణా బిడ్డకు అపూర్వ గౌరవం

March 25, 2017


img

రామగుండంలో పుట్టిపెరిగిన బి చంద్రకళ...అంటే మనలో చాలా మందికి తెలియకపోవచ్చు కానీ చంద్రకళ ఐ.ఏ.ఎస్. అంటే కొంతమంది తెలిసి ఉండవచ్చు. కానీ ఉత్తరప్రదేశ్ లో ఆమె పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం మీరట్ జిల్లా కలెక్టర్ గా చేస్తున్న ఆమె పేరు యూపిలో మారుమ్రోగితోంది. 

చంద్రకళ హైదరాబాద్ ఉస్మానియాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. 2008లో ఐ.ఏ.ఎస్. టాపర్ గా నిలిచారు. యూపిలోని బులంద్ షహర్, బిజ్నోర్, ప్రస్తుతం మీరట్ జిల్లాలకు కలెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. యూపిలో సమాజ్ వాదీ పాలనలో అవినీతి, రౌడీయిజం సర్వత్రా వ్యాపించాయి. కానీ తన జిల్లాలలో అవి పెరగకుండా చంద్రకళ ఎప్పటికప్పుడు కట్టడిచేస్తూ అవినీతి అధికారులు, కాంట్రాక్టర్ల గుండెల్లో రైళ్ళు పరుగులెత్తించారు. 

అది రోడ్ల నిర్మాణం కావచ్చు..లేదా రోడ్డు పక్కన ఉండే చెత్త తీసే పని కావచ్చు...ప్రతీ పనిలో ఇమిడి ఉన్న అవినీతిని ధైర్యంగా అడ్డుకొని పనులలో నాణ్యత ఉండేలా చేసి జిల్లా ప్రజల ప్రశంసలు అందుకొన్నారు. ఆమె పనితీరుపై జిల్లా అధికారులు, సమాజ్ వాదీ కాంట్రాక్టర్లు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు పిర్యాదులు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. కానీ ఆమె నీతి నిజాయితీ, పనిపట్ల కనబరిచే చిత్తశుద్దిని చూసి ముఖ్యమంత్రి కూడా ఆమెను ప్రశంసించకుండా ఉండలేకపోయారు. 

మోడీ ప్రభుత్వం సుమారు మూడేళ్ళ క్రితం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత ‘స్వచ్చా భారత్’ పధకం ప్రకటించింది. కానీ చంద్రకళ జిల్లా ఆ కార్యక్రమాని చాలా కాలం క్రితం నుంచే తన జిల్లాలలో అమలుచేస్తున్నారు. ఆమె జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే తన జిల్లాలో అన్ని ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాలలో పరిశుభ్రతను పాటించేవిధంగా కటినమైన చర్యలు తీసుకొన్నారు. అలాగే యూపిలో బిజ్నోర్ జిల్లాను మొట్టమొదటి ‘బహిరంగ మల విసర్జన రహిత జిల్లా’గా మార్చారు. తను పనిచేస్తున్న జిల్లాలలో స్వచ్చ భారత్ పధకాన్ని చాలా సమర్ధంగా అమలుచేసి చూపించారు.

ఈ కారణంగా ఆమెకు చాలా అపూర్వమైన గౌరవం దక్కింది. ఆమెను స్వచ్చా భారత్ మిషన్ డైరెక్టర్ గా,  కేంద్ర తాగునీరు మరియు పారిశుధ్ధ్య మంత్రిత్వశాఖకు ఉపకార్యదర్శిగా కేంద్రప్రభుత్వం నియమించింది. కనుక ఇప్పటి వరకు యూపిలో మూడు జిల్లాలకే సేవలందించిన ఆమె ఇప్పుడు యావత్ దేశానికి సేవలు అందించే అవకాశం పొందారు. మన తెలంగాణా బిడ్డ ఇంత ఇంత చిన్నవయసులో..ఇంత తక్కువ సర్వీసులో..ఇంత పెద్ద బాధ్యతలు నిర్వహించడం, ఇంత గుర్తింపు, గౌరవం పొందండం మనందరికీ గర్వకారణమే కదా! కనుక చంద్రకళ ఐ.ఏ.ఎస్.కు తెలంగాణా ప్రజలందరి తరపున అభినందనలు తెలియజేస్తోంది మైతెలంగాణా.కామ్.


Related Post