డిల్లీలో కపాల దీక్ష!

March 24, 2017


img

తమిళనాడు ప్రజలు, రాజకీయ పార్టీలు..వాటి నేతలు ఏమి చేసినా వెరైటీగానే ఉంటుంది..చాలా ఉదృతంగానే ఉంటుంది..చాలా ఎఫెక్టివ్ గానే ఉంటుందని జల్లికట్టు ఉద్యమంతో నిరూపించి చూపారు. తాజాగా తమిళనాడు రైతులు మళ్ళీ మరో పోరాటానికి సిద్దం అయ్యారు. అది కూడా డిల్లీలో..నేరుగా కేంద్రప్రభుత్వంతోనే! 

యూపిలో రైతుల పంట రుణాలను కేంద్రప్రభుత్వమే మాఫీ చేస్తుందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్ ప్రకటించడంతో, తమ రుణాలను కూడా కేంద్రప్రభుత్వమే రద్దు చేయాలని కోరుతూ తమిళనాడుకు చెందిన కొందరు రైతులు డిల్లీలో జంతర్ మంతర్ వద్ద గత 10 రోజులుగా ధర్నా చేస్తున్నారు. చాలా దిగ్బ్రాంతి కలిగించే విషయం ఏమిటంటే ఆర్ధిక సమస్యల కారణంగా ఆత్మహత్యలు చేసుకొన్న కొందరు రైతుల కపాలాలను తమ ముందు పెట్టుకొని వారు ధర్నా చేస్తున్నారు. తమ వాస్తవ పరిస్థితి కేంద్రప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతోనే ఆవిధంగా చేస్తున్నామని వారు చెప్పారు. 

తమిళనాడులో చాలా మంది రైతులు తీవ్ర ఆర్ధిక సమస్యలతో సతమతం అవుతున్నారని కేంద్రప్రభుత్వం తమను ఆదుకోకపోతే మున్ముందు ఇంకా అనేక వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితి ఏర్పడుతుందని వారు చెపుతున్నారు. రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు జల్లికట్టు హక్కు కోసం పోటాపోటీగా కేంద్రంతో పోరాడాయని, కానీ తాము ఆత్మహత్యలు చేసుకొంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 రోజులుగా డిల్లీలో తాము ధర్నా చేస్తున్నప్పటికీ ఇంతవరకు కేంద్రరాష్ట్రాలకు సంబందించిన వ్యక్తులు ఎవరూ కూడా ఇటువైపు తొంగిచూడలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఏదో ఒకటి సాధించుకొన్నాకనే ఇక్కడి నుండి తమ రాష్ట్రానికి తిరిగి వెళ్ళాలనుకొంటున్నామని వారు చెప్పారు. 

ఈ సంగతి తెలుసుకొన్న నటులు ప్రకాష్ రాజ్, విశాల్ డిల్లీ చేరుకొని ఇద్దరూ ఈరోజు వారితో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. ఇకనైనా కేంద్రప్రభుత్వం రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. వారిద్దరూ రైతులకు మద్దతు ప్రకటించారు కనుక బహుశః త్వరలోనే మిగిలిన నటీనటులు..వారిని అనుసరించి రాష్ట్రంలో ప్రతిపక్షాలు కూడా వచ్చి వారి పోరాటంలో పాల్గొనే అవకాశం ఉంది. ఏప్రిల్ 12న చెన్నైలోని ఆర్.కె.నగర్ ఉపఎన్నికలు కూడా జరుగబోతున్నాయి కనుక కనీసం వాటిని దృష్టిలో ఉంచుకొనైనా రాజకీయ పార్టీలన్నీ తమ రైతులు చేస్తున్న ఈ పోరాటానికి మద్దతు ప్రకటించవచ్చు. అదే కనుక జరిగితే ఈ ఉద్యమం కూడా జల్లికట్టులాగే ఉదృతరూపం దాల్చి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచడం ఖాయం. 


Related Post