ఆంధ్రా, తెలంగాణా అసెంబ్లీల తీరు ఎలా ఉందంటే..

March 24, 2017


img

తెలంగాణా, ఆంధ్రా శాసనసభ సమావేశాలు ఒకే సమయంలో జరుగుతున్నందున రెంటి పనితీరులో తేడాలు కళ్ళకు కట్టినట్లు స్పష్టంగా కనబడుతున్నాయి. 

ఏపిలో సమావేశాలు మొదలైన మొదటి రోజు నుంచే అధికార తెదేపా, ప్రతిపక్ష వైకాపాల మద్య భీకర స్థాయిలో జరుగుతున్న యుద్దాల వలన ఒక్కరోజు కూడా సభ సజావుగా సాగలేదు. ఆ కారణంగా ఒక్క సమస్యపై కూడా అర్ధవంతమైన చర్చ జరుగలేదు. రెండు పార్టీల ప్రతినిధులు కలిసి ఒక్క సమస్యను కూడా పరిష్కారం చేయలేకపోయారు. 

అగ్రిగోల్డ్ భూములపై జగన్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై అవినీతి ఆరోపణలు చేయడంతో దానిని రుజువు చేయాలని లేకుంటే సభకు రాకూడదని తెదేపా సభ్యులు సవాలు విసురుతుంటే, ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉందా లేదా? చెప్పాలని వైకాపా సభ్యులు ప్రతిసవాలు విసురుతున్నారు. ఈవిధంగా ప్రజా సమస్యల పేరుతో పరస్పరం నిందించుకొంటూ విలువైన సభా సమయాన్ని వృధా చేస్తున్నారు. 

ఇక్కడ తెలంగాణాలో కూడా అధికార, ప్రతిపక్షాల మద్య తీవ్రంగా వాదోపవాదాలు జరుగుతున్నప్పటికీ సభ్యులు అందరూ అదుపు తప్పకుండా చాలా హుందాగా వ్యవహరిస్తూ వివిధ ప్రజా సమస్యలపై చాలా లోతుగా అర్ధవంతమైన చర్చలు సాగిస్తుండటం చాలా అభినందనీయం. సభలో మాట్లాడేందుకు తమకు తగినంత అవకాశం ఇవ్వకుండా అధికార పార్టీ తమ గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నప్పటికీ అది నిజం కాదని ప్రత్యక్ష ప్రసారాల ద్వారా సభా కార్యక్రమాలను చూస్తున్నవారికి అర్ధం అవుతుంది. మంత్రి హరీష్ రావు చెప్పినట్లు తెలంగాణా శాసనసభ దేశంలో మిగిలిన రాష్ట్రాల శాసనసభలకు ఆదర్శవంతంగా సాగుతోందన్న మాట నూటికి నూరు శాతం నిజమే. 

అక్కడ ఆంధ్రాలో అధికార తెదేపా ప్రతిపక్ష వైకాపాకు అగ్రిగోల్డ్ భూములపై సవాలు విసరగా, ఇక్కడ తెలంగాణా శాసనసభలో కాంగ్రెస్ సభ్యులు ఇసుక మాఫియాపై తెరాస సర్కార్ కు సవాలు విసిరారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న ఇసుక మాఫియాలో ఎవరి ప్రమేయం ఉందో నిగ్గు తేల్చేందుకు హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని లేదా న్యాయవిచారణ జరుపాలన్న కాంగ్రెస్ డిమాండ్ ను తెరాస సర్కార్ తిరస్కరించడంతో అందుకు నిరసనగా కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాక్ అవుట్ చేశారు.  


Related Post