నిజామాబాద్ లో పసుపు బోర్డు?

March 24, 2017


img

దేశంలో వివిధరకాల ఆహార ఉత్పత్తులను లేదా వాణిజ్య పంటలను ఎక్కువగా పండించే ప్రాంతాలలో వాటికి సంబంధించిన బోర్డులు ఉంటాయి. ఉదాహరణకు కేరళలో కాయిర్ (కొబ్బరి పీచు) బోర్డు, ఏపిలో పొగాకు బోర్డు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో రైతులు పసుపు పంటను ఎక్కువగా సాగుచేస్తుంటారు. దేశంలో అనేక ప్రాంతాలకు ఇక్కడి నుంచే పసుపు రవాణా అవుతుంటుంది. కనుక నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ఆ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపి కవిత కేంద్రప్రభుత్వాన్ని కోరారు. ఆమె అభ్యర్ధనకు కేంద్రం సానుకూలంగా స్పందించడంతో జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుకు టర్మరిక్ బోర్డ్-2017 పేరిట ఆమె శుక్రవారం ఒక ప్రైవేట్ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టబోతున్నారు. ఆమె ప్రతిపాదనకు కేంద్రప్రభుత్వం సూత్రప్రాయంగా ముందే అంగీకరించింది కనుక అదే ఈ బిల్లుకు పార్లమెంటు చేత ఆమోదముద్ర వేయించే భాద్యత తీసుకోవచ్చు. ఆమె ప్రయత్నాలు ఫలించి జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు అయితే యావత్ దేశంలో పసుపు ఉత్పత్తి, కొనుగోళ్ళు మరియు అమ్మకాలకు నిజామాబాద్ కేంద్రంగా మారే అవకాశం ఉంటుంది. 

ప్రముఖ ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలి నిజామాబాద్ నుంచి పసుపు కొనుగోలు చేయడానికి, అలాగే అక్కడ తమ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ సంస్థ ప్రతినిధులతో తెరాస సర్కార్ చర్చలు జరుపుతోంది. అవి ఫలిస్తే నిజామాబాద్ జిల్లాలో పతంజలి ఉత్పత్తి కేంద్రం కూడా ప్రారంభం అవుతుంది. ఇది ఏర్పాటు అయితే నిజామాబాద్ జిల్లాలో, దాని పరిసర ప్రాంతాలలో పండే వివిద ఆహార ఉత్పత్తులకు మంచి గిరాకీ ఏర్పడుతుంది. అంతేకాక ఈ పరిశ్రమ వస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక వందలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి కవితక్క ప్రత్యేక శ్రద్దతో చేస్తున్న ఈ ప్రయత్నాలు అన్నీ త్వరలోనే ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి కనుక రాగల రెండేళ్ళలో నిజామాబాద్ జిల్లా, దాని పరిసర ప్రాంతాలు అన్నీ శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు కూడా ఉన్నాయి. 


Related Post