హైకోర్టుపై డ్రామా ఇంకా ఎన్నాళ్ళు?

March 22, 2017


img

రాష్ట్ర విభజన జరిగి ఆంధ్రా, తెలంగాణా ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడి దాదాపు మూడేళ్ళు కావస్తోంది. హైకోర్టు విభజన చేయాలని తెరాస సర్కార్ గత మూడేళ్ళుగా  కేంద్రాన్ని కోరుతూనే ఉంది. దాని కోసం రాష్ట్రంలోని న్యాయవాదులు, న్యాయమూర్తులు, ఉద్యోగులు సమ్మె చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్ ద్వారా ఏపి సిఎం చంద్రబాబు నాయుడుని హైకోర్టు విభజనకు సహకరించవలసిందిగా అభ్యర్ధించారు. ఇరు రాష్ట్రాల మంత్రుల కమిటీలు గవర్నర్ నరసింహన్  సమక్షంలో సమావేశమైనప్పుడు కూడా ఈ ప్రస్తావన వచ్చింది. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంతవరకు హైకోర్టు విభజన జరుగలేదు. ఆంధ్రా సర్కార్ ఇంతవరకు హైకోర్టు నిర్మాణం ఆలోచన కూడా చేయలేదు. 

షెడ్యూల్: 10 పరిధిలోని సంస్థల ఆస్తులు, ఉద్యోగులు పంపకాలు, నీటి వాటాలు, డిల్లీలో ఆంధ్రా భవన్ పంపకాలు వంటి అన్ని సమస్యలతో బాటే దీనిని పరిష్కరించుకొందామని ఏపి సర్కార్ చెపుతోంది. అంటే హైకోర్టు విభజనకు అది తెరాస సర్కార్ సహకరించేందుకు సిద్దంగా లేదని స్పష్టం అవుతోంది. కేంద్రప్రభుత్వం కూడా దానికే వంతపడుతూ తెరాస సర్కార్ అడిగినప్పుడల్లా కాదనకుండా హామీ ఇస్తూ కాలక్షేపం చేసేస్తోంది.

తెదేపా ఎంపి తోట నర్సింహం లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్న, దానికి కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పిన జవాబు పుండు మీద కారం చల్లినట్లున్నాయని చెప్పక తప్పదు. అమరావతిలో హైకోర్టు ఏర్పాటు చేయడం గురించి ఆయన అడిగిన ప్రశ్నకు, “అక్కడ హైకోర్టు ఏర్పాటుకు భవన సముదాయాలను ఏపి సర్కార్ సిద్దం చేయగానే కేంద్రప్రభుత్వం హైకోర్టును ఏర్పాటు చేయడానికి సిద్దంగా ఉంది,” అని రవిశంకర్ ప్రసాద్ జవాబు చెప్పారు. 

చంద్రబాబుకు ఏపిలో హైకోర్టు ఏర్పాటు చేసుకోవాలనే కోరికే ఉండి ఉంటే ఆయన తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ భవనాలు నిర్మించినట్లుగానే హైకోర్టు కోసం కూడా తాత్కాలిక భవనసముదాయాలు నిర్మించి ఉండేవారు. కానీ పైన పేర్కొన్న కారణాల చేత ఆయన అటువంటి ఆలోచన కూడా చేయడం లేదు. కనుక వచ్చే ఎన్నికలలో గా అమరావతిలో హైకోర్టు భవనసముదాయలను నిర్మించే ఆలోచన చేయకపోవచ్చు. ఈ సంగతి కేంద్రానికి తెలియదనుకోలేము. ఏపి సర్కార్ కు అమరావతిలో హైకోర్టు నిర్మించుకోవాలనే ఆసక్తి, ఆలోచనే లేనప్పుడు మళ్ళీ  తెదేపా ఎంపి ఇటువంటి ప్రశ్న అడగడం దానికి కేంద్రమంత్రి ఈవిధంగా జవాబు చెప్పడం రెండూ హాస్యాస్పదంగానే ఉన్నాయి. 


Related Post