జానా చెప్పిన ఆ బాహుబలి ఎవరు?

March 18, 2017


img

వచ్చే ఎన్నికలనాటికి కేసీఆర్ ను ఓడించే ‘బాహుబలి’ కాంగ్రెస్ పార్టీలో ఉద్భవించబోతున్నాడని సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి అన్నారు. ఈ కధకు (తెరాస పాలనకు) ఎవరు ముగింపునిస్తే వారే అసలైన బాహుబలి అని అన్నారు. కానీ ఆ బాహుబలి ఎవరో ఇప్పుడే చెప్పలేనని అన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తుడిచిపెట్టేయాలని తెరాస ప్రయత్నించినప్పటికీ, అది నేటికీ తెరాస సర్కారుకు గట్టి సవాళ్ళే విసురుతోంది. కానీ కేంద్ర, రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకత్వం లేకపోవడం, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కారణంగా అది తెరాస సర్కార్ తో ఎంతగా పోరాడుతున్నా బలపడలేకపోతోంది. ఈ నేపధ్యంలో త్వరలో బాహుబలి రాబోతున్నాడన్నట్లుగా జానారెడ్డి చెప్పడం విశేషమే. 

టీ-కాంగ్రెస్ లోని కోమటిరెడ్డి, జైపాల్ రెడ్డి,ఉత్తం కుమార్ రెడ్డి, జానారెడ్డి, గీతారెడ్డి, పొన్నాల, డికె అరుణ వంటి సీనియర్ నేతలు చాలామంది ఉన్నారు. కాని వారెవరిలో ఆ బాహుబలి లక్షణాలు లేవనే చెప్పుకోవచ్చు. ఉండిఉంటే నేడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇంత దయనీయంగా ఉండేది కాదు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారెవరూ కాకపోతే మరి ఆ బాహుబలి ఎవరు? అనే ప్రశ్న ఉదయిస్తుంది. 

ప్రస్తుతం తెరాస సర్కార్ ను ప్రతిపక్షాల కంటే కూడా ధీటుగా ఎదుర్కొంటున్న ఏకైక వ్యక్తి టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్. “ఆయన కాంగ్రెస్ ఏజంటు..కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికే దాని తరపున మా ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ బురదజల్లుతున్నారని” తెరాస నేతలు ఆరోపిస్తున్నారు. ఆయన కూడా వారి ఆరోపణలను బలపరుస్తున్నట్లుగా, “తెరాస సర్కార్ కంటే కాంగ్రెస్ హయంలోనే ఎక్కువ ఉద్యోగాలు భర్తీ అయ్యాయి,” అని అన్నారు. కనుక ఆయనకు కాంగ్రెస్ పట్ల కొంత సానుకూలత ఉన్నట్లుగానే కనిపిస్తోంది. పైగా ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలనే ఆలోచన కూడా ఉన్నట్లు ఆయన తరచూ సంకేతాలు ఇస్తున్నారు కనుక వచ్చే ఎన్నికలలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి కేసీఆర్ ను డ్డీ కొనే అవకాశాలు ఉన్నాయని భావించవచ్చు. కనుక జానారెడ్డి చెపుతున్న ఆ బాహుబలి ప్రొఫెసర్ కోదండరామ్ అయ్యుండవచ్చు.     



Related Post