తెలంగాణా రైతుల పట్ల వివక్ష దేనికి?

March 17, 2017


img

యూపిలో రైతులకు పంట రుణాలను మాఫీ చేస్తామని భాజపా ఇచ్చిన హామీని కేంద్రప్రభుత్వమే అమలుచేస్తుందని కేంద్ర వ్యవసాయమంత్రి రాధా మోహన్ సింగ్ నిన్న పార్లమెంటులో చెప్పడంతో సహజంగానే దానిపై ప్రతిస్పందనలు మొదలయ్యాయి. తెరాస ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మొదట స్పందించారు. 

యూపిలో సుమారు రూ. 50,000 కోట్ల పంట రుణాలను కేంద్రప్రభుత్వం మాఫీ చేయడానికి సిద్దం అవుతున్నప్పుడు, తెలంగాణాలో రైతుల పట్ల వివక్ష ఎందుకు చూపుతోందని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. యూపితో బాటు తెలంగాణా రైతుల పంట రుణాలను మాఫీ చేయడానికి కేంద్రప్రభుత్వం ఉదారంగా ఆర్ధిక సహాయం అందించాలని కోరారు. 

యూపిలోని బనారస్ హిందూ యూనివర్సిటీకి రూ.100 కోట్లు ఇచ్చిన కేంద్రప్రభుత్వం, శతాబ్ది ఉత్సవాలు జరుపుకొంటున్న ఉస్మానియా యూనివర్సిటీకి ఒక్క పైసా విదిలించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర భాజపా నేతలు, ఎమ్మెల్యేలు తమ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు సాధించుకు రావాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు. తెలంగాణాకు ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి అందించాలని కోరారు.

బహుశః రేపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఆ తరువాత వరుసగా మిగిలిన రాష్ట్రాలు కూడా కేంద్రాన్ని నిలదీయవచ్చు. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు వివిద పనులకు లేదా వివిధ పద్ధుల క్రింద కొద్దిగా ఆర్ధిక సహాయం చేయమని కోరుతూ డిల్లీ చుట్టూ ఎన్ని ప్రదక్షిణాలు చేసినా మోడీ ప్రభుత్వం కనికరించలేదు. కానీ యూపిలో తమ భాజపా ప్రభుత్వం ఏర్పాటు అవుతోంది గనుక ఏకంగా రూ. 50,000 కోట్లు ఇచ్చేసేందుకు సిద్దం అవుతోంది. 

కేంద్రప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతోందని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉత్తరాది రాష్ట్రాలకు చాలా ఉదారంగా నిధులు మంజూరు చేసే కేంద్రప్రభుత్వం, దక్షిణాది రాష్ట్రాలకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో పంట రుణాలు మాఫీకి కేంద్రప్రభుత్వం సహాయపడకపోవడాన్ని పవన్ కళ్యాణ్ తప్పు పట్టారు. దక్షిణాది రాష్ట్రాలపట్ల కేంద్రప్రభుత్వం ప్రదర్శిస్తున్న ఈ వివక్ష వలన జాతి సమగ్రత దెబ్బ తినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో పంట రుణాలు మాఫీకి కేంద్రప్రభుత్వం సహాయం అందించాలని ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి పవన్ కళ్యాణ్ చేశారు.     



Related Post