కాంగ్రెస్ ఎన్నటికీ మారదా?

March 17, 2017


img

కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఓడిపోయిన ప్రతీసారి వినిపించే మాటలే మళ్ళీ ఇప్పుడు మరోమారు వినిపిస్తున్నాయి. గోవా, మణిపూర్ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ అసెంబ్లీ స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్-చార్జ్ ల అసమర్ధత, నిర్లక్ష్యం కారణంగా రెండు రాష్ట్రాలను చేజార్చుకోవలసి వచ్చిందని కాంగ్రెస్ నేతలు చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

వారిలో చాలా మంది సోనియా, రాహుల్ గాంధీల చుట్టూ దశాబ్దాలుగా తిష్ట వేసుకొని కూర్చొన్న ముసలి కాంగ్రెస్ నేతలను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తుంటే, మరికొందరు ‘హైకమాండ్ వైఫల్యం చెందింది’ అంటూ పరోక్షంగా సోనియా, రాహుల్ గాంధీలపై విమర్శలు కురిపిస్తున్నారు. 

కాంగ్రెస్ నేతల విమర్శలు సరైనవేకావచ్చు కానీ కాంగ్రెస్ నేతలు అందరూ కలిసి అప్రజాస్వామికంగా వ్యవహరించి అధికారం చేజిక్కించుకొన్న భాజపాతో, కేంద్రప్రభుత్వంతో యుద్ధం చేయడం మాని తమలో తామే కలహించుకొంటున్నారు. కేంద్రంలో భాజపా అధికారంలో ఉంది గనుకనే అది చెప్పినట్లుగా రెండు రాష్ట్రాల గవర్నర్లు నడుచుకొని ప్రజాస్వామ్యవిధానాలను పక్కనపెట్టి అతి పెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకకుండా రెండవ స్థానంలో ఉన్న భాజపాను ఆహ్వానించారు. దీనిపై కాంగ్రెస్ సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసినా ఫలితం లేకపోయింది. కనుక తన ప్రయత్నాలను విరమించి అంతర్గత పోరాటాలలో నిమగ్నం అయినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ నేతలు తమకు జరిగిన అన్యాయం గురించి ప్రజల వద్దకు వెళ్ళి మోర పెట్టుకొని ఉండి ఉంటే ఏమైనా ఫలితం ఉండేది. కనీసం దానిపై సానుభూతి, భాజపా పట్ల ఎంతో కొంత వ్యతిరేకత ఏర్పడి ఉండేది. ఇంత చిన్నపని కూడా చేయకపోగా తమలో తామే కుమ్ములాడుకొంటున్నారు. ఇది కేంద్రప్రభుత్వానికి చాలా ఊరట కలిగించే విషయమేనని చెప్పవచ్చు.

ఏమైనప్పటికీ, కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల ఫలితాలను తుది హెచ్చరిక వంటివేనని చెప్పవచ్చు. కనుక ఇప్పటికైనా అది మేలుకొని తమ అధినేతలతో సహా పార్టీని, తన మూసదోరణిలో సాగే తమ ఆలోచనా విధానాలను సమూలంగా మార్చుకోవడం చాలా అవసరం. లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఇక ఎంతో కాలం మనుగడ సాగించలేకపోవచ్చు.


Related Post