తెలంగాణా ప్రజలు ఆదరిస్తారా..డౌటే!

March 16, 2017


img

జనసేన పార్టీ వచ్చే ఎన్నికలలో రెండు తెలుగు రాష్ట్రాలలోను పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆయనకు ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో చాలా మంది అభిమానులు ఉన్నమాట వాస్తవమే. ఆంధ్రాలో అభిమానులు మరో ఆలోచన లేకుండా జనసేనకు ఓట్లు వేయవచ్చు. సాధారణ ప్రజలు కూడా ఓట్లు వేయవచ్చు. కానీ తెలంగాణాలో అభిమానులు, ప్రజలు ఆయన పార్టీకి ఓట్లు వేస్తారా? అంటే అనుమానమే. కారణాలు అందరికీ తెలిసినవే. మొట్టమొదటిది ఆయన ఆంధ్రాకు చెందినవ్యక్తి కావడం. రెండు తెలంగాణాలో తెరాస ప్రభావం బలంగా ఉండటం. మూడు 'జనసేన పార్టీకి అధికారం అక్కరలేదు' అన్నట్లు పవన్ కళ్యాణ్ మాట్లాడటం. 

తెలంగాణాలో చాలా బలంగా ఉన్న కాంగ్రెస్, తెదేపా, భాజపా, మజ్లీస్, వామపక్షాలే తెరాసను ఎదుర్కోలేకపోతున్నప్పుడు జనసేన పార్టీ తెరాసను ఎదుర్కొని గెలవగలదని ఆశించడం అత్యాశే అవుతుంది. పవన్ కళ్యాణ్ వామపక్షాలతో పొత్తులు పెట్టుకొనే ఆలోచనలో ఉన్నట్లు కనబడుతున్నారు. ఒకవేళ ప్రొఫెసర్ కోదండరామ్ కూడా వారితో చేతులు కలిపినట్లయితే, అందరూ కలిసి తెరాసకు గట్టి పోటీ ఇవ్వగలరేమో కానీ విజయం సాధించడం చాలా కష్టమే కావచ్చు.

పవన్ కళ్యాణ్ తమకు అధికారం అక్కరలేదని చెప్పుతున్నప్పుడు మళ్ళీ ఎన్నికలలో ఎందుకు పోటీ చేస్తోందని ప్రత్యర్దులు ప్రశ్నించకమానరు. అటువంటి పార్టీకి ఓట్లు వేస్తే అవి మురిగిపోతాయని ప్రచారం చేయకుండా ఉండవు. కనుక పవన్ కళ్యాణ్ ముందుగా ఆ ముక్కను ఉపసంహరించుకోవాలి లేదా సవరించుకోవలసి ఉంటుంది. ఏమైనప్పటికీ జనసేన తెలంగాణాలో పోటీ చేయగలదేమో కానీ గౌరవప్రదమైన సీట్లు సాధించడం కష్టమే కావచ్చు. 


Related Post