పవన్ కళ్యాణ్ ఎలాంటి వాడంటే: జగన్

March 15, 2017


img

తెలంగాణాలో ప్రతిపక్షాలు తెరాస సర్కార్ బడ్జెట్ పై తీవ్ర విమర్శలు చేసినట్లుగానే, ఏపిలోని తెదేపా సర్కార్ బడ్జెట్ పై జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక విలేఖరి పవన్ కళ్యాణ్ గురించి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా, “ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఊసు మనకెందుకబ్బా.. అయినా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఎవరు వచ్చినా వారిని ఆప్యాయంగా ఆహ్వానిస్తాము..వారికి అండగా నిలబడతాము. వారితో కలిసి పోరాడాటానికి మేము సిద్దంగా ఉన్నాము. పవన్ కళ్యాణ్ పరిస్థితి ప్రస్తుతం ఎలాగుందంటే చంద్రబాబు సిట్ అంటే కూర్చొంటాడు..స్టాండ్ అంటే నిలుచోంటాడు..”అని జగన్ అన్నారు. 

పవన్, జగన్ ఇద్దరూ ఏపికి ప్రత్యేక హోదా సాధించడం కోసం పోరాడుతుంటారు. కలిసి పోరాడేందుకు తమకు ఎటువంటి అభ్యంతరమూ లేదని ఇద్దరూ చెపుతుంటారు. కానీ ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవన్నట్లు వారిరువురూ ఎన్నడూ కలిసి పోరాడరు. ఒకరంటే మరొకరికి సదాభిప్రాయం లేకపోవడం, రాజకీయంగా భిన్నాభిప్రాయాలు, ఆశయాలు కలిగి ఉండటం, చంద్రబాబు నాయుడు పట్ల పవన్ కళ్యాణ్ కొంత మెతక వైఖరి ప్రదర్శిస్తుండటం అందుకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. జగన్ ఆశయం ఎప్పటికైనా ఏపికి ముఖ్యమంత్రి కావడమైతే, పవన్ కళ్యాణ్ ఆశయం ప్రజాసమస్యలపై ప్రభుత్వంతో పోరాడి వాటిని పరిష్కరించడమే. పవన్ కళ్యాణ్ తను అమితంగా గౌరవించే అన్నయ్య చిరంజీవితోనే ఇమడలేనని చెపుతున్నప్పుడు జగన్ వంటి వ్యక్తితో చేతులు కలుపుతారనుకోలేము. అలాగే తనతో సమానంగా ప్రజాధారణ, పేరుప్రతిష్టలు కలిగిన పవన్ కళ్యాణ్ తో జగన్ కలిసి పనిచేయలేరు. 


Related Post