తెలంగాణాలో వైకాపా ఉంది...ఇవిగో రుజువులు

March 14, 2017


img

తెలంగాణా రాష్ట్రంలో ఉందో లేదో తెలియని వైకాపా 10 జిల్లాలకు పార్టీ ఇన్-చార్జ్ లను, 5 జిల్లాలకు అధ్యక్షులను, 23 శాసనసభ నియోజక వర్గాలకు సమన్వయకర్తలను నియమించుకోవడం విశేషం. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపడుతున్నట్లు రాష్ట్ర వైకాపా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి (సాక్షి) మీడియాకు తెలిపారు. 

జిల్లా అధ్యక్షులు: మెదక్: బి. సంజీవరావు, వికారాబాద్: కె.యాదయ్య, యాదాద్రి: వి వెంకటేష్, జనగాం: ఎం.కల్యాణి రాజ్, గద్వాల: అతిక్ రహమాన్. 

తెలంగాణాలో ఒకప్పుడు వైకాపా చాలా బలంగా ఉండేది. కొండా సురేఖ, మహేందర్ రెడ్డి వంటి బలమైన నేతలు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి మీద అభిమానంతో వైకాపాలో చేరారు. తెలంగాణా ఉద్యమాలు చాలా ఉదృతంగా సాగుతున్న సమయంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నప్పటికీ వారు జగన్ వెంటే ఉన్నారు. కానీ రాష్ట్ర విభజన అనివార్యమని గ్రహించిన వెంటనే జగన్మోహన్ రెడ్డి తన స్వార్ధం తను చూసూకొంటూ వారినందరినీ నడిరోడ్డున విడిచిపెట్టేసి రాత్రికి రాత్రే ఆంధ్రాకు వచ్చేసి సమైక్య శంఖారావం పూరించారు. 

సమైక్య పోరాటాలతో తెలంగాణా ప్రజలకు ఆగ్రహం కలిగించి దూరం చేసుకొన్నారు. చిత్తశుద్ధి లేని ఆ పోరాటాలు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేసినవే కావడంతో ఆంధ్రాలో ప్రజలు కూడా వైకాపాను తిరస్కరించారు. ఆవిధంగా వైకాపా రెండు రాష్ట్రాలలో చెడింది.

జగన్ హైదరాబాద్ లోనే ఉంటున్నప్పటికీ ఆయన కూడా ఏనాడూ తెలంగాణా ప్రజల సమస్యల గురించి మాట్లాడరు. అదే ఆంధ్రాలో ఏ చిన్న ప్రమాదం జరిగినా జగన్ రెక్కలు కట్టుకొని అక్కడ వాలిపోతుంటారు. కనుక అయన ప్రాధాన్యత ఆంద్రాకే తప్ప తెలంగాణాకు కాదని అర్ధం అవుతోంది. అలాగే తెలంగాణా వైకాపా నేతలు కూడా ఏనాడూ రాష్ట్ర ప్రజల కోసం పోరాడింది లేదు. వారి తీరు చూస్తుంటే వారు తెలంగాణా ప్రజల కోసమే ఉన్నారా లేక లో జగన్ ప్రయోజనాలను కాపాడేందుకే ఉన్నారా? అనే అనుమానం కలుగుతుంది. బహుశః అందుకే తెలంగాణాలో పూర్తిగా అది తన ఉనికిని కోల్పోయినప్పటికీ దానిని ఒక డమ్మీ పార్టీలాగ నడిపిస్తున్నారనే అనుమానం కలుగుతోంది. 


Related Post