గోవా తరువాత గుజరాత్ వంతా?

March 11, 2017


img

ఒకప్పుడు మనోహర్ పారిక్కర్ గోవా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో భాజపాకు మంచిపట్టు ఉండేది. ఆయన రక్షణమంత్రి పదవి చేప్పట్టడం కోసం డిల్లీకి వెళ్ళిపోతునప్పుడు తన స్థానంలో లక్ష్మీకాంత్ పర్సేకర్ కు గోవా భాద్యతలు అప్పగించారు. కానీ ఆయనకు పారిక్కర్ అంత ప్రజాధారణ లేదు. కనీసం అంత గొప్పగా పాలించలేకపోవడంతో గోవాలో భాజపా బలహీనపడింది. ఆ సంగతి భాజపా అధిష్టానం కూడా గుర్తించినందునే మళ్ళీ మనోహర్ పారిక్కర్ కే ఎన్నికల ప్రచార భాద్యత అప్పగించింది. భాజపా మళ్ళీ గెలిచినట్లయితే ఆయనే ముఖ్యమంత్రి పదవి చేపడతారని మీడియాకు లీకులు ఇచ్చింది కూడా. కానీ ఫలితం కనబడలేదు. 

అవలీలగా గెలుచుకోదగిన ఎన్నికలలో భాజపా ఎంతగా చెమటోడ్చినా విజయం సాదించలేకపోయింది. మొత్తం ఇంతవరకు ప్రకటించిన ఫలితాలలో భాజపా కేవలం 10 స్థానాలు గెలుచుకొని మరో నాలుగు స్థానాలలో ఆధిక్యతలో సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలు గెలుచుకొని మరో రెండు స్థానాలలో ఆధిక్యతలో సాగుతోంది. ఇతరులు ఏడుగురు విజయం సాధించగా మరో మూడు స్థానాలలో ఆధిక్యతలో సాగుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 21 సీట్లు అవసరం. 

భాజపా, కాంగ్రెస్ రెండు పార్టీలకు ఇంచుమించు సరిసమానంగా అంటే (13-15) సీట్లు వచ్చే అవకాశం ఉంది కనుక అధికారం దక్కించుకొనేందుకు తప్పని సరిగా స్వతంత్ర అభ్యర్ధుల మద్దతు అవసరం ఉంటుంది. కనుక కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగానే ప్రయత్నించడం ఖాయం. 

ఇప్పుడు భాజపాకు గోవాలో ఎదురైన ఈ చేదు అనుభవం చూస్తున్నప్పుడు మున్ముందు దానికి గుజరాత్ లో కూడా ఇటువంటి పరిస్థితే ఎదురవవచ్చనే అనుమానంకలుగుతోంది. ఎందుకంటే, ఒకప్పుడు ఆ రాష్ట్రాన్ని పాలించిన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పదవి చేపట్టేందుకు డిల్లీ వెళ్ళిపోతూ ఆనందీ బెన్ పటేల్ ను ముఖ్యమంత్రిగా నియమించారు. ఆమె హాయంలో హార్దిక్ పటేల్ నేతృత్వంలో పటేల్ కులస్తులకు రిజర్వేషన్లు కావాలని కోరుతూ జరిగిన ఆందోళనలను అదుపు చేయడంలో విఫలం అవడంతో భాజపా ఆమెను తొలగించి విజయ్ రూపానిని ముఖ్యమంత్రిగా నియమించింది. కొన్ని రోజుల క్రితమే హార్దిక్ పటేల్ శివసేన పార్టీలో చేరి గుజరాత్ లో కూడా దానిని బలపరిచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కనుక ఈ ఏడాది చివరిలో జరుగబోయే గుజరాత్ ఎన్నికలలో భాజపాకు అతని నుంచి సవాలు ఎదుర్కోవలసి రావచ్చు. కనుక భాజపా ఇప్పటి నుంచే జాగ్రత్తపడకపోతే గోవాలో ఎదురైనా చేదు అనుభవమే గుజరాత్ లో కూడా ఎదురయ్యే అవకాశం కనబడుతోంది. 


Related Post