మాకూ ఓ 70 వస్తాయి

March 11, 2017


img

ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే తెరాసకు 101-106 సీట్లు వస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడంతో మళ్ళీ అన్ని పార్టీలు జబ్బలు చరుచుకోవడం మొదలుపెట్టాయి. వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెరాసయే గెలుస్తుందని గొప్పలు చెప్పుకొంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజినామాలు చేయించి ఎన్నికలకు వెళ్ళడానికి భయపడుతున్నారెందుకని ప్రశ్నించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మా పార్టీకి కనీసం 70 సీట్లు రావడం ఖాయం అని చెప్పారు. 

అంతకు ముందు టిపిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి ఒక సర్వే చేయించుకొని ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి 50 సీట్లు గెలుచుకొంటుందని మరో 24 సీట్లలో తెరాసకు గట్టిగా పోటీ ఈయగలదని ప్రకటించారు. అంటే కాంగ్రెస్ నేతల లెక్కలలోనే చాలా తేడాలున్నట్లు స్పష్టం అవుతోంది. 

తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తమ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో ప్రకటించలేదు కానీ వచ్చే ఎన్నికలలో తప్పకుండా తమ పార్టీయే గెలిచి తెలంగాణాలో అధికారంలోకి రాబోతోందని జోస్యం చెపుతుంటారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ ముఖ్యమంత్రికి దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని సవాలు విసిరారు.  

ఇక భాజపా సరేసరి..తమకు చాలా గట్టి పట్టున్న గ్రేటర్ హైదరాబాద్ లోనే చతికిలపడినా వచ్చే ఎన్నికలలో తమ పార్టీయే తప్పకుండా గెలువబోతోందని బల్ల గుద్ది వాదిస్తుంటారు. ఇప్పుడు యూపిలో భాజపా గెలించింది కనుక తెలంగాణాలో కూడా గెలిచేయడం ఖాయం అనట్లే మాట్లాడవచ్చు.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహిస్తున్న సిపిఐ (ఎం) నేత తమ్మినేని వీరభద్రం కూడా వచ్చే ఎన్నికలలో తప్పకుండా తమ పార్టీయే గెలుస్తుందని వాదిస్తున్నారు. యూపి, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో కూడా నిన్నటి వరకు అన్ని పార్టీలు ఇలాగే ప్రగల్భాలు పలికాయి. కానీ ఇప్పుడు ఓడిపోయిన పార్టీలన్నీ తలదించుకొంటున్నాయి. కనుక విజయం సాధించడం కోసం ఏమి చేయాలో అది చేసుకుపోవడం అందరికీ మంచిది లేకుంటే ప్రగల్భాలు పలికి ఇలాగే నవ్వులపాలవక తప్పదు.


Related Post