యూపి లాటరీ ఎవరికి తగులుతుందో?

March 08, 2017


img

అన్ని పార్టీలకు చాలా కీలకమైన యూపి ఎన్నికలు ముగిసాయి. మార్చి 11న ఫలితాలు వెలువడతాయి. వాటిలో ఎవరు గెలిచినా అది చాలా గొప్ప విషయమే అవుతుంది. ఎవరు ఓడిపోయినా వారికి అది చాలా పెద్ద ఎదురు దెబ్బే అవుతుంది. 

ఒకవేళ భాజపా గెలిస్తే ఇక ప్రధాని నరేంద్ర మోడీకి తిరుగు ఉండదు. నోట్ల రద్దుతో సహా ఆయన నిర్ణయాలన్నిటికీ ప్రజల ఆమోదం పొందినట్లే అవుతుంది కనుక మున్ముందు మరింత దూకుడుతో సాగవచ్చు. ఒకవేళ అఖిలేష్ యాదవ్ గెలిస్తే, అతనితో బాటు రాహుల్ గాంధీ కూడా గెలిచేసినట్లే చెప్పుకోవచ్చు కనుక ఇక నిశ్చింతగా కాంగ్రెస్ పట్టాభిషేకం చేసేసుకోవచ్చు. ఒకవేళ మాయావతి గెలిస్తే అధికారం కోసం ఆమె నిరీక్షణ ముగిస్తుంది కనుక మళ్ళీ ఐదేళ్ళపాటు దర్జాగా రాష్ట్రాన్ని తన ఇష్టం వచ్చినట్లు పాలించుకోవచ్చు. 

ఒకవేళ ఈ ఎన్నికలలో భాజపా ఓడిపోయినట్లయితే, అది మోడీ ఓటమిగానే భావించబడుతుంది. ముఖ్యంగా నోట్ల రద్దు నిర్ణయాన్ని తప్పనే ప్రతిపక్షాల వాదన సరైనదేనని దృవీకరించినట్లు అవుతుంది. అయితే మోడీ ప్రస్తుతం తిరుగులేని అధికారం చలాయిస్తున్నారు కనుక ఈ ఓటమి ఆయనపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. 

ఇక మేము లోకల్ బాయ్స్ అని చెప్పుకొని తిరిగిన అఖిలేష్-రాహుల్ ఓడిపోయినట్లయితే, అఖిలేష్ ముఖ్యమంత్రి పదవి కోల్పోయి ఐదేళ్ళ పాటు ప్రతిపక్ష బెంచీలలో సర్దుకుపోవలసి వస్తుంది. పదేళ్ళపాటు తిరుగులేని అధికారం చలాయించినందున ప్రతిపక్ష బెంచీలలో అడ్జస్ట్ అవడం కొంచెం కష్టమే. ఈ ఓటమితో రాహుల్ గాంధీ నాయకత్వ లక్షణాల గురించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చ మొదలయ్యే అవకాశం ఉంటుంది కనుక పట్టాభిషేకానికి కొంచెం ఇబ్బందే. కానీ నవ్వితే నవ్వి పోదురుగాక.. అనుకొని చేసుకోకతప్పదు లేకుంటే చివరికి ఆ అవకాశం కూడా కోల్పోవచ్చు. గత పదేళ్ళుగా ప్రతిపక్ష బెంచీలలో కూర్చొని అధికారం కోసం తపస్సు చేస్తున్న మాయావతి ఈసారి కూడా ఓడిపోయినట్లయితే మరో ఐదేళ్ళపాటు పార్టీని విచ్చినం కాకుండా కాపాడుకోవడం ఆమె శక్తికి మించినపనే కావచ్చు. మరో మూడు రోజులలో యూపి లాటరీ ఫలితాలు వస్తాయి. ఎవరికి లాటరీ తగులుతుందో చూడాలి.


Related Post