టిజెఎసిలో ఏమిటీ లొల్లి?

March 07, 2017


img

టిజెఎసి అధ్వర్యంలో నిరుద్యోగ ర్యాలి నిర్వహించలేకపోయినా దానికి వచ్చిన అపూర్వమైన స్పందన కారణంగా అది విజయవంతం అయ్యిందనే చెప్పవచ్చు. ఆ కారణంగా తెరాస సర్కార్ పై తీవ్ర ఒత్తిడికి గురయ్యింది కూడా. ఈ అనూహ్య విజయంతో ప్రొఫెసర్ కోదండరామ్ పేరు మీడియాలో మరోసారి మారుమ్రోగిపోయింది. ఆయనకు...టిజెఎసికి ఇక తిరుగులేదనుకొంటున్న సమయంలో అనూహ్యంగా జెఎసి సభ్యుడు పిట్టల రవీందర్ ఆయనపై తిరుగుబాటు చేసి జెఎసి నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఆయన అంతటితో ఆగలేదు. ప్రొఫెసర్ కోదండరామ్ ని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేస్తూ ఒక లేఖ వ్రాశారు. టిజెఎసిని నిలువున చీల్చడానికి సిద్దం అవుతున్నారు. 

ఆయన ప్రయత్నాల వలననో లేక ప్రొఫెసర్ కోదండరామ్ తీరు పట్ల నిజంగానే అసంతృప్తి ఉన్న కారణంగానో టిజెఎసిలో చాలా మంది నేతలు ఇప్పుడు పిట్టల రవీందర్ శిబిరంలో చేరుతున్నారు. వారిలో టిజెఎసి కో-చైర్మన్ నల్లపు ప్రహ్లాద్, కో-కన్వీనర్ తన్వీర్ సుల్తాన, స్టీరింగ్ కమిటీ సభ్యులు, వివిధ జిల్లాలకు చెందిన కన్వీనర్లు ఉన్నారు. వారందరూ నిన్న హైదరాబాద్ లో సమావేశం అయ్యి చర్చించుకొన్న తరువాత, మళ్ళీ ప్రొఫెసర్ కోదండరామ్ ను విమర్శిస్తూ ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. ఈసారి వ్రాసిన లేఖలో ప్రొఫెసర్ కోదండరామ్ ను మరింత ఘాటుగా విమర్శించారు. 

జిల్లాలలో టిజెఎసి సదస్సులు ఏర్పాటు చేస్తే ప్రొఫెసర్ కోదండరామ్ వచ్చి వాటిలో ప్రసంగించి వెళ్ళిపోవడమే తప్ప అందులో లేవనెత్తిన సమస్యల పరిష్కారం చేసింది ఏమీ లేదని విమర్శించారు. ఆయన తన స్వంత ఇమేజ్ పెంచుకోవడమే తప్ప ఉద్యమకారుల కోసం ఇంతవరకు ఏమీ చేయలేకపోయారని లేఖలో విమర్శించారు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా నడుస్తున్న టిజెఎసిని తీసుకువెళ్ళి రాజకీయ పార్టీల చేతిలో పెడుతున్నారని విమర్శించారు. ఇదివరకు తను వ్రాసిన లేఖలో అంశాలపై టిజెఎసి స్టీరింగ్ కమిటీలో చర్చించకుండా, ప్రశ్నించినందుకు తనను టిజెఎసి నుంచి బహిష్కరిస్తానని ప్రొఫెసర్ కోదండరామ్ చెప్పడాన్ని పిట్టల రవీందర్ తప్పు పట్టారు. 

టిజెఎసిలో మొదలైన ఈ గొడవలు దానిని నిలువునా చీల్చబోతున్నట్లు కనబడుతోంది. అదే జరిగితే ఇంతవరకు తెరాస సర్కార్ తో పోరాడుతున్న టిజెఎసి ఇక ముందు దానిలో అదే పోరాడుకొనే దుస్థితి ఏర్పడవచ్చు. ఇప్పటికే అది మొదలైంది కూడా. అయితే పిట్టల రవీందర్ వర్గం టిజెఎసిను నిలువునా చీల్చిన తరువాత ఏవిధంగా ముందుకు సాగాలనుకొంటోంది? తెరాస సర్కార్ కు అండగా నిలవాలనుకొంటోందా? వ్యతిరేకించాలనుకొంటోందా? అనే దాని మనుగడ ఆధారపడి ఉంటుంది. ఒకవేళ తెరాస సర్కార్ కు అనుకూలంగా సాగిపోదలిస్తే వారికి తెరాస మద్దతు లభిస్తుంది. లేకపోతే తమ ఉనికిని కోల్పోవచ్చు. టిజెఎసిలో జరుగుతున్న ఈ గొడవలు తెరాస సర్కార్ కు చాలా ఉపశమనం కలిగించే విషయమే. బహుశః అందుకే అది వారి గొడవలలో తలదూర్చకుండా దూరంగా ఉండి చూస్తున్నట్లుంది. 


Related Post