భారతీయుల నెత్తిన మరో ట్రంపు బాంబు

March 04, 2017


img

విదేశీయుల నెత్తిన వరుసగా బాంబుల వంటి ఆంక్షలు వేస్తున్న ట్రంప్ ప్రభుత్వం ఈరోజు మరో బాంబు పేల్చింది. అదే హెచ్ 1-బి వీసాల కోసం ప్రీమియం సర్వీస్ రద్దు. ఏప్రిల్ 3నుంచి ఈ ప్రీమియం సర్వీస్ ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. బహుశః ఈ తాజా నిషేధం కనీసం మరో 6 నెలల పాటు అమలులో ఉండవచ్చని తెలుస్తోంది.

అమెరికాకు అత్యవసరంగా వెళ్ళాలనుకొనే విదేశీయులకు, విదేశీ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ విధానంలో కేవలం 15 రోజులలో హెచ్ 1-బి వీసాలు మంజూరు చేసేవారు. దాని కోసం అదనంగా 1,225 అమెరికన్ డాలర్లు రుసుము చెల్లించవలసి ఉంటుంది. సాధారణ పద్దతిలో అయితే హెచ్1-బి వీసా మంజూరు అయ్యేందుకు కనీసం 6 నెలల సమయం పడుతుంది కనుక చాలా మంది 1,225 డాలర్లు చెల్లించి ఈ ప్రీమియం సర్వీస్ పద్ధతిలో వీసా పొందేవారు. ముఖ్యంగా అమెరికాలో వివిధ సంస్థలకు ఐటి సేవలు అందిస్తున్న భారతీయ కంపెనీలు ఈ పద్దతిలోనే హెచ్1-బి వీసాలు తీసుకొని తమ ఉద్యోగులను అమెరికాకు పంపుతుండేవి. 

కనుక అమెరికాలో పనులున్నవారికి, ముఖ్యంగా ఐటి సంస్థలకి ఇది చాలా పెద్ద షాక్ అనే చెప్పవచ్చు. ఇప్పుడు ఇక్కడి నుంచి అత్యవసరంగా అమెరికాకు ఐటి ఉద్యోగులను పంపడం సాధ్యం కాదు. అలాగే అవుట్ సోర్సింగ్ విధానంలో భారత్ నుంచే పనిచేసే వీలు కూడా లేకుండా చేసేందుకు నిన్ననే అమెరికన్ కాంగ్రెస్ లో ఒక బిల్లు ప్రవేశపెట్టారు. అది చట్టరూపం దాలిస్తే భారత ఐటి సంస్థలు ఇక్కడి నుంచి సేవలు అందించలేవు. 

అవుట్ సోర్సింగ్ మరియు ఈ హెచ్1-బి వీసాలపై ఆంక్షల కారణంగా భారతీయ సంస్థలు ఇక్కడి నుంచి సేవలు అందించలేవు..అక్కడికి తమ ఉద్యోగులను పంపించలేవు. కనుక అమెరికన్ సంస్థల కాంట్రాక్టులు వదులుకోక తప్పనిసరి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఇది వాటిపై చాలా తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం కనబడుతోంది. ట్రంప్ ప్రభుత్వం విసురుతున్న ఊహించని ఈ సవాళ్ళను భారతీయ కంపెనీలు ఏవిధంగా ఎదుర్కొని తట్టుకొని నిలబడతాయో చూడాలి. 


Related Post