డి.ఎం.కె. భలే మెలిక పెట్టింది

February 25, 2017


img

తమిళనాడులో వ్యక్తి పూజ కాస్త ఎక్కువేనన్న సంగతి తెలిసిందే. అక్కడ అన్నాడిఎంకె పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది కనుక ఎక్కడ చూసినా ‘అమ్మ’ ( స్వర్గీయ జయలలిత) భజన మారుమ్రోగిపోతుంటుంది. ఇటీవల జరిగిన అనూహ్య రాజకీయ పరిణామాల దృష్ట్యా అమ్మ భజన ఇంకా తప్పనిసరి అయిపోయింది. ఎవరైనా చేయకపోతే అందరూ అనుమానంగా చూస్తారు. కనుక పార్టీలో ప్రభుత్వంలో పోటాపోటీగా అమ్మ భజన సాగిపోతోంది. 

దీనిపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ డిఎంకె అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లిఖిత పూర్వకంగా ఒక పిర్యాదు చేసింది. అక్రమాస్తుల కేసులో శశికళతో బాటు చనిపోయిన జయలలితను కూడా సుప్రీంకోర్టు దోషిగా పేర్కొంది కనుక అటువంటి వ్యక్తి ఫోటోలను ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రుల చాంబర్లలో నుంచి తక్షణం తొలగించాలని కోరింది. అలాగే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అమ్మ పేరు పెట్టడం, ఆమె జయంతి సందర్భంగా ప్రజాధనంతో న్యూస్ పేపర్లు, టీవీ ఛానళ్ళలో ప్రకటనలు ఇవ్వడాన్ని డి.ఎం.కె. తప్పు పట్టింది. ఇకనైనా అమ్మ ఫోటోలు తొలగించి, అమ్మ పేరిట ఖర్చులు చేయడం మానుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసి వస్తుందని డి.ఎం.కె. హెచ్చరించింది. 

చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొంటున్నట్లుగా అన్నాడిఎంకెలో దాని ప్రభుత్వంలో నేతలందరూ ప్రజలను ఆకట్టుకొని తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి అమ్మ ఫోటోలు పెట్టుకొని, అమ్మ భజన చేస్తున్నారు. ఇప్పుడు డి.ఎం.కె. ఈవిధంగా అభ్యంతరం లేవనెత్తడం వారందరికీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని కల్పించినట్లయింది. 

న్యాయపరంగా డి.ఎం.కె. అభ్యంతరాలు సరైనవే కనుక దాని హెచ్చరికలను ఖాతరు చేయకపోతే న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అలాగని అమ్మ ఫోటోలు తీసేసి, అమ్మ భజన మానుకొంటే రాజకీయంగా ఇబ్బందిపడవలసి వస్తుంది. కనుక అన్నాడిఎంకెకి ఇది ఒక పరీక్ష వంటిదేనని చెప్పవచ్చు. 


Related Post