టీ-కాంగ్రెస్ ఇంకా ఎప్పుడు మేల్కొంటుందో?

February 24, 2017


img

తెలంగాణాలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజార్టీతో గెలుస్తుందని కోమటిరెడ్డి తదితరులు చెపుతుంటే, 50 సీట్ల కంటే ఎక్కువ గెలుచుకొనే అవకాశం లేదని సాక్షాత్ టిపిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి జోస్యం చెపుతుంటారు. ఆవిధంగా మాట్లాడుతున్న ఆయనకి పార్టీ అధ్యక్షుడుగా కొనసాగే అర్హత లేదని, ఆ పదవిని తమ ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని కోమటిరెడ్డి సోదరులు చెపుతుంటారు. తమకి అధ్యక్ష పదవి దక్కాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ యాగాలు చేస్తుంటారని వెంకటరెడ్డి చెప్పడం విచిత్రం. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి రావడం ఖాయమని అప్పుడు కె జానారెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం వారు చెపుతున్నారు. 

వచ్చే ఎన్నికలలో పార్టీని గెలిపించుకోవాలంటే ఏమి చేయాలని అందరూ గట్టిగా ఆలోచించకపోగా ఈ విధంగా ఎవరికివారు తమకు అనుకూలంగా జోస్యాలు చెప్పుకొంటూ, కుమ్ములాడుకొంటూ కాలక్షేపం చేసేస్తున్నారు. కాంగ్రెస్ హయంలోనే తెలంగాణా ఏర్పాటు జరిగినప్పటికీ ఆ వేడిలో కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గెలువలేకపోయింది. నిజానికి అది వారికి ఒక అద్భుతమైన అవకాశం కానీ దానిని వారు గుర్తించడంలో చాలా ఆలశ్యం చేయడంతో అది వారి చేజారిపోయింది. ఆ తరువాత ఆపరేషన్ ఆకర్షతో రాష్ట్రంలో పార్టీ సగం ఖాళీ అయిపోయింది. అయినా కాంగ్రెస్ నేతలు మేల్కొన్నట్లు లేదు. 

తెలంగాణా ఏర్పాటయిన కొత్తలో పరిస్థితులు తమకు చాలా అనుకూలంగా ఉన్నప్పుడే గెలువలేకపోయిన కాంగ్రెస్ నేతలు, రాష్ట్రంలో తెరాస చాలా బలపడి, కాంగ్రెస్ బలహీనపడి ఉన్నప్పుడు ఈవిధంగా ఒకరితో ఒకరు కీచులాడుకొంటూ ఎన్నికలలో ఏవిధంగా విజయం సాధించగలమని భావిస్తున్నారో వారికే తెలియాలి. పార్టీలో నేతలు కీచులాడుకొంటుంటే జానారెడ్డి, జైపాల్ రెడ్డి వంటి సీనియర్ నేతలు, కాంగ్రెస్ అధిష్టానం కూడా ప్రేక్షకులలాగ వాటిని చూస్తుండిపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ మళ్ళీ ఓడిపోయినట్లయితే ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనబడకుండా పోయే ప్రమాదం ఉందని కాంగ్రెస్ నేతలు అందరూ గ్రహించడం మంచిది.


Related Post