ట్రంప్ నిర్ణయాలు అగ్నికి ఆజ్యం పోసినందునే..

February 25, 2017


img

అమెరికా కాన్సాస్ రాష్ట్రంలో ఇద్దరు తెలుగు ఇంజనీర్లపై ఒక అమెరికన్ కాల్పులు జరుపడం, దానిలో శ్రీనివాస్ అనే వ్యక్తి చనిపోవడంతో అమెరికా శ్వేత జాత్యాహంకారం, డోనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు, అమెరికన్ ప్రజలపై ఆ ప్రభావంపై దేశంలో చర్చలు మొదలయ్యాయి. ట్రంప్ ప్రదర్శిస్తున్న జాత్యాహంకారం కారణంగానే అమెరికాలో శ్వేతజాతీయులు ఈవిధంగా రెచ్చిపోతున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. 

“ఇది మన దేశం...మన ఉద్యోగాలు మనకే..” అంటూ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు, అందుకు అనుగుణంగా ప్రకటిస్తున్న నిర్ణయాల కారణంగా ఒక వర్గం అమెరికన్లపై ఆ ప్రభావం బాగా పడి ఉండవచ్చు. కానీ అంతమాత్రన్న అమెరికన్లు అందరూ ట్రంప్ తో ఏకీభవిస్తున్నారని..విదేశీయుల పట్ల వ్యతిరేకత కలిగి ఉన్నారని అనుకోవడం చాలా తప్పే. 

శ్రీనివాస్, అలోక్ రెడ్డిలపై ఆడం పూరింటన్ అనే శ్వేతజాతీయుడు కాల్పులు జరుపుతున్నప్పుడు అతనిని అడ్డుకొన్న వ్యక్తి ఇయాన్‌ గ్రిలట్‌ ఒక అమెరికనే. ఆ ప్రయత్నంలో తీవ్రంగా గాయపడిన అతను ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఇక శ్రీనివాస్ మృతిపట్ల అనేక వేలమంది అమెరికన్లు సంతాపం వ్యక్తం చేయడమే కాకుండా ఆయన కుటుంబాన్ని ఆదుకోవడానికి చాలా ఉదారంగా విరాళాలు కూడా అందిస్తున్నారు. ప్రవాసభారతీయులు 150,000 డాలర్లు విరాళాలు సేకరించాలని అనుకోగా కేవలం 24 గంటలలోనే 300,000 డాలర్లు జమా అయ్యాయి. ఇది అమెరికన్లలో మరో మానవీయకోణానికి చక్కటి నిదర్శనంగా నిలుస్తోంది. 

చాలా మంది రాజకీయ నేతలు తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల బలహీనతలను, కష్టాలను గుర్తించి వారిని రెచ్చగొట్టి అధికారంలోకి వస్తుంటారు. అమెరికాలో నిరుద్యోగ సమస్య..ఆ కారణంగా పేదరికం నెలకొని ఉన్నమాట వాస్తవం. దానిని ట్రంప్ గుర్తించి హైలైట్ చేసి అధికారంలోకి రాగలిగారు. ఆ విధానాలనే యదాతధంగా కొనసాగిస్తుండటం వలన ఇంతవరకు పేద, నిరుద్యోగ అమెరికన్లలో గూడుకట్టుకొనున్న ఆ బాధే మొన్న ఈవిధంగా బయటపడిందని చెప్పవచ్చు.

ఎక్కడికెక్కడి నుంచో వస్తున్న విదేశీయులు విలాసవంతమైన జీవితాలు గడుపుతుంటే నిరుద్యోగం, పేదరికంలో మ్రగ్గుతున్న అమెరికన్లకు వారి పట్ల ఇటువంటి అసూయ, ద్వేషభావనలు కలుగడం సహజమే. గతంలో కూడా ఇటువంటి దాడులు జరిగాయి కానీ వాటిని ఒబామా సర్కార్ అదుపులో ఉంచింది. ట్రంప్ సర్కార్ వాటికి తన నిర్ణయాలతో వాటికి ఆజ్యం పోస్తోంది కనుక మున్ముందు ఇటువంటి దాడులు పునరావృతం కావచ్చు లేదా ట్రంప్ చల్లబడితే ఈ విద్వేషం కూడా తాత్కాలికంగా మాయమవవచ్చు. కానీ అమెరికాలో నెలకొన్న ఈ పరిస్థితులు అమెరికా ఉద్యోగాల విషయంలో భారతీయులు పునరాలోచించుకోవలసిన అవసరం చాలా ఉందని స్పష్టం చేస్తున్నాయి. 


Related Post