ప్రజాధనంతో మొక్కులా..హవ్వ!

February 24, 2017


img

తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే బంగారు ఆభరణాలు సమర్పించుకొంటానని కేసీఆర్ దేవుళ్ళకి మొక్కుకోవడాన్ని ఎవరూ తప్పు పట్టలేదు. ఎందుకంటే అది ప్రజల ఆకాంక్ష. అది తీర్చాలని ఆయన భగవంతుని కోరుకొన్నారు. మొక్కుకొన్నారు. ఆ కోరిక తీరడంతో ఇప్పుడు వరుసగా ఆ మొక్కులన్నీ తీర్చుతున్నారు. అయితే అది ఆయన స్వంత డబ్బుతోనో లేకపోతే తెరాస ఫండ్ లో నుంచో తీసి చెల్లించి ఉండి ఉంటే చాలా హుందాగా ఉండేది. కానీ కామన్ గుడ్ ఫండ్ కి వచ్చిన విరాళాలను కేసీఆర్ ఈవిధంగా తన స్వంత మొక్కుల కోసం ఖర్చు చేస్తుండటం తప్పని సీనియర్ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి విమర్శించారు.

ఎండోమెంట్ యాక్ట్ లోని సెక్షన్ (70)(1)(ఏ) క్రింద హిందువులు లేదా హిందూ సంస్థలు లేదా స్వచ్చంద సంస్థలు ఇచ్చే విరాళాలతో ఏర్పాటు చేసిన ఈ కామన్ గుడ్ ఫండ్ లో నిధులను కేవలం దేవాలయాల పునరుద్దరణ, ధూపదీపనైవేద్యాల కోసం, ఆగమ, వేద పాఠశాలల నిర్వహణ కోసం మాత్రమే వినియోగించాలని చెపుతోంది. ఆ నిధులను వాడకంపై చాలా నిర్దిష్ట నియమ నిబంధనలున్నప్పటికీ, కేసీఆర్ వాటిని పట్టించుకోకుండా తన ఇష్టం వచ్చినట్లు ఆ నిధులను ఖర్చు చేస్తున్నారని శశిధర్ రెడ్డి విమర్శించారు.

ఈ వ్యవహారంపై కోర్టులో పిటిషన్ వేయబోతున్నట్లు చెప్పారు. వెంకన్నకు తయారు చేయించిన ఆభరణాల విషయంలోను తమకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని అన్నారు. వాటిని ఏ ప్రాతిపదికన సదరు సంస్థకు కేటాయించారు? వాటికి ఎంత ఖర్చయింది? వంటి విషయాలలో తెరాస సర్కార్ అసలు పారదర్శకత పాటించలేదని అభిప్రాయపడ్డారు. ఈ మొక్కుల విషయంలో వామపక్షాలు కూడా అభ్యంతరాలు లేవనెత్తుతున్నాయి. విద్యార్ధులు, నిరుద్యోగులు, రైతుల సమస్యలు పట్టించుకోకుండా కేసీఆర్ గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతున్నారని తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మొక్కులు, దానికయ్యే ఖర్చు మొదలైన విషయాలన్నీ ముందుగా శాసనసభకు తెలియజేసి దాని అనుమతితో చెల్లించి ఉండి ఉంటే నేడు ఎవరూ ఈవిధంగా అభ్యంతరాలు వ్యక్తం చేసేవారు కాదు. లేదా అయన తన స్వంత డబ్బుతో చేయించినా ఎవరూ వేలెత్తి చూపగలిగేవారు కాదు. ఈ విమర్శలకు అయన ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.


Related Post