అభిమానులకే జనసేనలో అవకాశాలు

February 20, 2017


img

ఈరోజు గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన చేనేత కార్మికుల సభకు ముఖ్య అతిధిగా హాజరైన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రసంగం క్లుప్తంగా: 

1. కోట్లు కుమ్మరించే కార్పోరేట్ కంపెనీలకు కంటే మన దేశానికే గర్వకారణమైన చేనేత పరిశ్రమకు   బ్రాండ్ అంబాసిడర్ గా చేయడానికే నేను ఇష్టపడతాను. 

2. ఆంధ్రా, తెలంగాణా ప్రభుత్వాలు చేనేత పరిశ్రమను ఆదుకోవడానికి కొన్ని చర్యలు చేపట్టాయి. కానీ ప్రభుత్వం ప్రకటించిన ఆ హామీలు సరిగ్గా ఆచరింపపడుతున్నాయా లేదా అని గమనించేందుకు ఒక మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలి.

3. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రత్యేక కార్పోరేషన్ను ఏర్పాటుచేయాలి. 

4. క్రికెట్, సినిమా వంటి రంగాలలో ప్రతిభ చూపిన వారికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అవార్డులు ఇస్తున్నట్లుగానే చేనేత రంగంలో వారికి కూడా ప్రోత్సాహకాలు ఇవ్వాలి. 

5. చేనేత తల్లుల దుస్థితి చూస్తుంటే గుండె పిందేసినట్లుంది. అంత వయసులో కూడా వారు శరీరంలో ఓపిక, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా పనిచేయవలసి రావడం మన నేథలకి సిగ్గు అనిపించడం లేదా? వారి తల్లులను బాగా చూసుకొంటున్నట్లుగానే చేనేత తల్లులు కాస్త సుఖంగా జీవించేందుకు నెలకి ఇంత పెన్షన్ కూడా ఇవ్వలేరా? 

6. చేనేత ద్వారా జరుగవలసిన కొన్ని పనులను బడా పారిశ్రామికవేత్తలు కొందరు పవర్ లూమ్స్ ద్వారా కానిచ్చేస్తుందున చేనేత కార్మికుల జీవితాలు దయనీయంగా మారిపోయాయి. పదిమందికి ఉపాధి కల్పించగల చేనేత కళాకారులు పొట్ట చేత్తో పట్టుకొని ఒక సాధారణ కార్మికుడుగా పనిచేసే దుస్థితి నెలకొని ఉండటం సిగ్గుచేటు. ఇకనైనా ప్రభుత్వం మేల్కొని ఈ పవర్ లూమ్ దోపిడీని నియంత్రించాలి.  

7. చేనేత రంగం నుంచి యువప్రతినిధులను జనసేనలోకి తీసుకొని, చేనేత కార్మికుల గొంతు చట్ట సభలలో బలంగా వినబడేలా చేస్తాము.

8. వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీ తప్పకుండా పోటీ చేస్తుంది. చిత్తశుద్ధి, మంచి దమ్మున్న నాయకుల కోసం వెతుకుతున్నందునే ఇంతవరకు పార్టీ నిర్మాణం మొదలుపెట్టలేదు. నాకు వేరే పార్టీల నుంచి నేతలు, అక్కరలేదు. నన్ను అభిమానించే మీలో నుంచే యువనాయకులు కావాలి. జనసేన పార్టీలో చేరేందుకు చేనేత రంగం నుంచి యువ ప్రతినిధిని ఆహ్వానిస్తున్నాను.            

9. మార్చి 14తో జనసేనకు మూడేళ్ళు నిండుతాయి. ఆరోజున జనసేన అధికారిక వెబ్ సైట్ ను ఏర్పాటు చేస్తాము. దానికి చేనేత, మైనింగ్, భూసేకరణ, విద్యా, వైద్యం వంటి వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు, ప్రజలు తమ సూచనలు, సలహాలు ఇవ్వవలసినదిగా ప్రార్ధిస్తున్నాను. దానిని బట్టి వచ్చే ఎన్నికలకి జనసేన మ్యానిఫెస్టో తయారుచేసుకొంటాము.  

10. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ప్రజలను మోసం చేశాయని భావిస్తున్నాను. హోదా ఇవ్వకపోతే ఆ విషయం సూటిగా చెప్పాలి. కానీ హోదా, ప్రత్యేక ప్యాకేజీ, మళ్ళీ దానికి చట్టబద్దత కల్పిస్తామని ఒకసారి అవసరం లేదని మరొకసారి చెపుతూ ఇంకా ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. 

11. నా అభిమానులు, తెలుగు ప్రజలందరూ మన చేనేతన్న కళాకారులను ఆదుకోవడం కోసం చేనేత బట్టలు ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. 



Related Post